
రవాణా సదుపాయాలతో అభివృద్ధి
ఆమదాలవలస: ఏదైనా ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రవాణా సదుపాయాలు అత్యంత ముఖ్యమ ని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించిన బెర్హంపూర్ – సూరత్ (ఉద్నా) అమృత్ భారత్ రైలును శనివారం శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వే స్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమృత్ భారత్ రైలు దేశ రైల్వే రూపురేఖలు మార్చిందన్నారు. శ్రీకాకుళం, పలాసలో రెండు హాల్ట్‌లు ఇచ్చినట్లు తెలిపారు. విమానాల్లో ఉండే సదుపాయాలు అమృత్ భారత్ రైళ్లలో ఉన్నాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రైల్వే డీఆర్‌ఎం లలి త్ బొహ్రా, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఆర్డీవో సాయి ప్రత్యూష, డీసీసీబీ అధ్యక్షుడు శివ్వల సూర్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఉద్దానం ప్రజలకు వరం
పలాస: బరంపురం నుంచి సూరత్ వెళ్లే అమృత్ భారత్ రైలు ఉద్దానం ప్రాంత ప్రజలకు వరం లాంటిదని ఖుర్ధా ఏఆర్‌డీఎం ప్రమోదకుమార్ బెహరా అన్నారు. పలాస రైల్వేస్టేషన్‌లో రైలు స్వాగత కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతం నుంచి ఎక్కువ మంది సూరత్, కాండ్ల, గుజరాత్, రాయపూర్, బిలాయ్ తదితర ప్రాంతాలకు వలస వెళ్తుంటారని, వారికి ఈ రైలు చాలా ఉపయోగమన్నారు. కార్యక్రమంలో డీసీఎం సుక్రాంబరో, పలాస రైల్వే మేనేజర్ ఎస్‌కే దాసు, పలాస – కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.