
సైకో ఎవరనేది ప్రజలకు తెలుసు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): నిండు శాసనసభలో పద్ధతి లేకుండా జేబులో చెయ్యిపెట్టుకుని, కళ్లద్దాలు నెత్తిన పెట్టుకుని సభా సంప్రదాయాలు పాటించకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన బాలకృష్ణ సైకోనా.. పద్ధతిగా ఉండే మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సైకోనా అనేది ప్రజలందరికి తెలుసునని మాజీ శాసన సభాపతి, శ్రీకాకుళం పార్లమెంటరీ పరిశీలకుడు తమ్మినేని సీతారాం అన్నారు. ఆమదాలవలసలో శనివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ గతంలో బెల్లంకొండ సురేష్‌పై కాల్పులు జరిపిన బాలకృష్ణను కాపాడింది ఆనాటి సీఎం దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి అని గుర్తు చేశారు. వైఎస్సార్ కుటుంబాన్ని ఒక్క మాట కూడా అనే హక్కు వారికి లేదన్నారు. సినీ పరిశ్రమ, సినిమా హీరోలకు జగన్‌మోహన్‌రెడ్డి అంటే చాలా అభిమానం ఉందన్నారు. కరోనా సమయంలో చిరంజీవి, సినిమా హీరోలంతా కలుస్తామని అడిగితే అన్ని రకాల మర్యాదలతో కలిసి సినీ ఇండస్ట్రీ సమస్యలు పరిష్కరించింది జగన్ అని గుర్తు చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి సైకో అని వ్యాఖ్యానించిన బాలకృష్ణ పూర్తిగా మెంటలైపోయాడేమేనని అనిపిస్తుందన్నారు. కరోనా నిబంధనల మేరకే ఐదుగురికి అవకాశం ఇస్తే చాలదు అంటే 10 మందికి అవకాశం కల్పించి విందు ఇచ్చి మరి మర్యాద చేశారని చెప్పారు. బాలకృష్ణ ఏ రకమైన సైకోనో నాకు బాగా తెలుసునని, టీడీపీలో చాలాకాలం ప్రయాణం చేశానన్నారు. బాలకృష్ణకు ఎవరైనా ఫోన్ చేస్తే ఎవడ్రా.. అని నోటికొచ్చినట్లు పిచ్చోడిలా మాట్లాడతాడని అన్నారు. వైఎస్సార్ దయాదాక్షణ్యాలతో బతుకుతున్నావన్న విష యం మరిచిపోకూడదన్నారు. పవన్, చిరంజీవి ఫ్యామిలీలతో బాలకృష్ణకు ఏమైనా పొరపొచ్చాలుంటే మీరు మీరు తేల్చుకోవాలి తప్ప జగన్‌పై అవాకులు, చవాకులు మాట్లాడితే సహించేది లేదన్నారు. బాలకృష్ణ తీరు మార్చుకోకుంటే వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.