
ఇంటి నిర్మాణంపై వివాదం
కొత్తూరు: మండలంలోని కడుము కాలనీలో ఇంటి నిర్మాణం, ఖాళీ స్థలంపై రెండు వర్గాల మధ్య శనివారం వివాదం చెలరేగింది. కాలనీలో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఎం.అప్పారావు నిర్మిస్తున్న ఇంటికి స్లాబ్ వేసేందుకు శనివారం ఏర్పాట్లు చేశారు. అయితే అప్పారావు ప్రభుత్వ పాఠశాలకు చెందిన స్థలంలో ఇంటి నిర్మాణం చేస్తున్నందున పనులు నిలుపుదల చేయాలని కాలనీకి చెందిన వి.గోవిందరావు, విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. విషయం తెలియడంతో స్థానిక సీఐ చింతాడ ప్రసాద్, ఎస్‌ఐ ఎండీ అమీర్ అలీ తమ సిబ్బందితో చేరుకున్నారు. అనంతరం తహసీల్దార్ కె.బాలకృష్ణకు ఫిర్యాదు చేయడంతో ఆయన ఇంటి పనుల వద్దకు చేరుకున్నారు. రికార్డులు పరిశీలించిన తర్వాత అప్పారావు నిర్మిస్తున్న ఇల్లు జిరాయితీ స్థలంలో ఉందని స్పష్టం చేశారు. అనంతరం పనులు చేపట్టేందుకు అప్పారావు సమాయత్తమయ్యారు. పాఠశాల స్థలంలో పనులు చేపడితే అడ్డుకోవడం తప్పదని గ్రామస్తులు కొంతమంది అధికారులకు తెలిపారు. ఇల్లు నిర్మిస్తున్న స్థలంతో పాటు పాఠశాల స్థలాన్ని కడుము కాలనీకి చెందిన ఒకరు గతంలో దానం చేశారని, అందుకు సంబంధించిన అధారాలు అక్టోబర్ 5వ తేదీన సమర్పిస్తామన్నారు. దీంతో అప్పటి వరకు పనులు నిలుపుదల చేయాలని తహసీల్దార్ ఆదేశించడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది.