
కింజరాపు కుటుంబం దోచుకుంటోంది
● అక్రమాలపై అధికారులు దృష్టి సారించడం లేదు ● వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త తిలక్
టెక్కలి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కింజరాపు కుటుంబం జిల్లాలో మైనింగ్ ఆదాయంతో పాటు ఇతర ప్రభుత్వ ఆదాయ వనరులన్నీ దోచుకుంటోందని వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం టెక్కలిలోని ఆ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. విజిలెన్స్ ఎస్పీ నిరంకుశ వైఖరితో కింజరాపు కుటుంబం చేస్తున్న అక్రమాలపై దృష్టి సారించకుండా, వైఎస్సార్‌సీపీ నాయకులకు చెందిన క్వారీలు, క్రషర్లపై కక్షపూరితమైన చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. దోపిడీపై ఆధారాలతో సహా చెబుతున్నా మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.
అక్టోబర్ 6న ముట్టడి
కింజరాపు కుటుంబం చేస్తున్న మైనింగ్ అక్రమాల తో పాటు మైన్స్ అధికారుల కక్ష సాధింపు చర్యలపై తిరుగుబాటు చేస్తున్నట్లు తిలక్ తెలియజేశారు. ఈ మేరకు అక్టోబర్ 6వ తేదీన టెక్కలిలో మైన్స్ కార్యాలయాన్ని ముట్టడికి పిలుపునిచ్చారు. కూట మి కక్ష సాధింపుతో నష్టానికి గురైన మైనింగ్ నిర్వాహకులతో పాటు రాజకీయ పార్టీలు, కార్మికులు తరలి రావాలని కోరారు. సొంత నియోజకవర్గంలో రైతులకు యూరియా ఇవ్వలేని అసమర్ధత మంత్రి అచ్చెన్నాయుడు అని ఎద్దేవా చేశారు. ఇటీవల జరిగిన కొత్తమ్మ తల్లి ఉత్సవాలు ఏర్పాట్లలో పూర్తిగా వైఫల్యం కనిపించిందన్నారు. అధికారులు భక్తుల సౌకర్యాలపై దృష్టి సారించకుండా మంత్రి అచ్చెన్నాయుడు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మెప్పు కోసం ఆరాటపడ్డారని మండిపడ్డారు. కలెక్టర్, ఎస్పీ సైతం టీడీపీ నాయకుల సేవలో నిమగ్నం కావడం సిగ్గుచేటన్నారు. కొత్తమ్మ తల్లి ఉత్సవాల నిర్వహణలో ప్రభుత్వం ఇచ్చిన నిధులు, చేసిన ఖర్చులపై దేవదాయ శాఖ అధికారులు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హెలీకాఫ్టర్ రైడ్ పేరుతో భక్తుల నుంచి దోపిడీ చేసి కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు సొంత ప్రచారాలు చేసుకున్నారని దుయ్యబట్టారు. ఇటీవల నందిగాం మండలంలో ఒక ఫైనాన్స్ సంస్థ దళిత కుటుంబాన్ని వేధిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. సినీ నటుడు బాలకృష్ణ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సమావేశంలో నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్ముర్తి, టెక్కలి వైస్ ఎంపీపీ పి.రమేష్, నాయకులు కె.అజయ్, ఎ.రాహుల్, చిన్ని జోగారావు, బి.రాజేష్, దానయ్య, కర్నిక జీవన్ తదితరులు పాల్గొన్నారు.