
ప్రజలకు అవగాహన కల్పించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి అధికారులు సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారిన ధరల విషయంపై ప్రజలకు తెలియజేయాలన్నారు. ఇంటింటికీ వెళ్లి జీఎస్టీ తగ్గింపు, తగ్గింపు వలన సేవింగ్స్ గురించి వివరించాలని పేర్కొన్నారు. పోస్టర్లు తయారు చేసి సచివాలయాలు, గ్రామ, మండలాల వారీగా ఏర్పాటు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జీఎస్టీ డిప్యూటీ కమిషనర్, శ్రీకాకుళం జిల్లా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ నోడల్ ఆఫీసర్ స్వప్న దేవి మాట్లాడుతూ సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ఈనెల 22వ తేదీన ప్రారంభమైందన్నారు. జీఎస్టీ తగ్గింపు వలన పేద, మధ్య తరగతి కుటుంబాలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ సుధాకర్, డీఆర్‌డీఏ పీడీ కిరణ్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ లక్ష్మణమూర్తి, డీపీవో భారతి సౌజన్య తదితరులు పాల్గొన్నారు.