
గంజాయితో యువకుడు అరెస్టు
ఇచ్ఛాపురం: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో 15.080 కేజీల గంజాయితో యువకుడిని అదుపులోకి తీసుకున్నామని సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. ఈ మేరకు సీఐ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. పట్టణ పోలీసుస్టేషన్ ఇన్‌చార్జి ఎస్‌ఐ వి.రవివర్మ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది రైల్వేస్టేషన్‌లో సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో తమిళనాడుకి చెందిన అజయ్ అనే యువకుడు 15.080 కేజీల గంజాయితో పట్టుబడ్డారు. నిందితుడిని విచారించి తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లా మేళకొండై గ్రామానికి చెందిన అజయ్‌గా గుర్తించారు. యువకుడు మైదానంలో ఆడడానికి వెళ్లేటప్పుడు అతనికి గంజాయి వ్యాపారం చేసే విగ్నేశ్వర్ అలియాస్ విక్కి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని విక్కికి అజయ్ చెప్పాడు. దీంతో ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చేందుకు తనకు సహకరిస్తే సేవించడానికి గంజాయితో పాటు అదనంగా రూ.5 వేలు ఇస్తానని విక్కి చెప్పాడు. దీనికి అజయ్ అంగీకరించి ఈనెల 14వ తేదీన బయల్దేరి రైలు ద్వారా తమిళనాడు నుంచి ఒడిశాలోని బరంపురం వచ్చారు. అనంతరం మోహన ప్రాంతంలో ధౌడ్‌ధీర అలియాస్ దీరజ్ అనే వ్యక్తి వద్ద నుంచి గంజాయిని కొనుగోలు చేశారు. అక్కడి నుంచి బరంపురం రైల్వేస్టేషన్‌కి చేరుకున్నారు. రైల్వేస్టేషన్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండడం గమనించి, బరంపురం నుంచి బస్సు ద్వారా ఇచ్ఛాపురం చేరుకున్నారు. వీరిలో అజయ్ రైల్వేస్టేషన్ సమీపంలో గంజాయి బ్యాగుతో వేచి ఉండగా విక్కి రైలు టికెట్ తీసేందుకు స్టేషన్‌కి వెళ్లాడు. ఈ క్రమంలో స్టేషన్ సమీపంలో తనిఖీలు నిర్వహించేందుకు వచ్చిన పట్టణ పోలీసులకు అజయ్ గంజాయి బ్యాగుతో పట్టుబడ్డాడు. ఇతని వద్ద నుంచి గంజాయి, కీప్యాడ్ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కి తరలించినట్లు పోలీసులు తెలిపారు.