
పని గంటల పెంపు సరికాదు
శ్రీకాకుళం (పీన్‌కాలనీ): కార్మికులంతా కలిసి సాధించుకున్న పని గంటలను 8 నుంచి 10కి పెంచుతూ కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం సరికాదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎం.ఆదినారాయణమూర్తి, కె.సూరయ్య, ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావులు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పని గంటల పెంపునకు వ్యతిరేకంగా కార్మికవర్గం ఐక్యంగా ఉద్యమించాలన్నారు. దీనిలో భాగంగా మున్సిపల్ కార్యాలయం గాంధీ విగ్రహం వద్ద సోమవారం నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ కన్వీనర్ ఆర్.ప్రకాశరావు, బీఎస్‌ఎన్‌ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి ఎం.గోవర్ధనరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.బలరాం, స్మార్ట్ కం ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు బి.జనార్ధనరావు, నీలం జూట్ కార్మిక సంఘం అధ్యక్షుడు ఎన్.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.