కూటమి కుమ్ములాట | - | Sakshi
Sakshi News home page

కూటమి కుమ్ములాట

Sep 23 2025 11:12 AM | Updated on Sep 23 2025 11:12 AM

కూటమి కుమ్ములాట

కూటమి కుమ్ములాట

● అసెంబ్లీని తాకిన ..

ఎన్‌ఈఆర్‌ వర్సెస్‌ కూన రవికుమార్‌

చిచ్చురేపిన గ్రావెల్‌,

ఇతరత్రా వ్యవహారాలు

వర్గపోరులో ఆధిపత్యం కోసం వివాదం

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

కూటమిలో గ్రావెల్‌ చిచ్చు రేపింది. ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావు, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ మధ్య రేగిన వివాదం అసెంబ్లీని తాకింది. అసెంబ్లీ ప్రజా సమస్యల కంటే వ్యక్తిగత సమస్యలకు వేదికై ంది. కూటమి అధికారంలోకి వచ్చాక తమ పార్టీ వారికి కాకుండా వేరొకరికి గ్రావెల్‌ తవ్వకాలకు అనుమతి ఇచ్చారని బీజేపీ ఎమ్మెల్యే అక్కసు వెళ్లగక్కుతూ.. ఆ క్వారీకి అండగా పక్కనున్న టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారని తెలిపారు. ఏకంగా అసెంబ్లీలో ప్రస్తావన వరకు వచ్చిందంటే వీరి మధ్య వివాదం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు వీరిద్దరి నడుమ గ్రావెల్‌ ఒక్కటేనా.. ఇంకేమైనా వ్యవహారాలు విభేదాలకు దారితీశాయా? అన్న అనుమానం కూడా కలుగుతోంది.

ఎవరికి వారే..?

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అటు ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావు, ఇటు ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ఎవరి వ్యవహారాలు వాళ్లు చేసుకుంటున్నారు. అవకాశం మేరకు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఫిర్యాదులు, ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. రణస్థలం మండలంలో ఉన్న కంపెనీల దగ్గరి నుంచి ఎచ్చెర్ల మండలంలోని భూముల వరకు వ్యవహారాలు నడిచాయి. అనుచరుల బెదిరింపుల వరకు వెళ్లాయి. ఈ క్రమంలో దారికి తెచ్చుకున్న పరిస్థితులు ఉన్నాయి. అధికారులు సైతం పనిచేయలేక చేతులేత్తేసి, సెలవుపై వెళ్లిపోతామని చెప్పిన రోజులు ఉన్నాయి. ఎచ్చెర్ల నియోజకవర్గంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయి.

వ్యవహారం నచ్చక..

రణస్థలం మండలంలోని సంచాం కొండలోని గ్రావెల్‌ తవ్వకాలు ఆ ఇద్దరి ఎమ్మెల్యేల మధ్య వివాదం రేపింది. గుండు కై లాష్‌ పేరున సంచాం రెవెన్యూలోని 89/6లో సుమారు 7 ఎకరాల వరకు గ్రావెల్‌ లీజు అనుమతి తీసుకున్నారు. ఈయన దగ్గర ఎమ్మెల్యే కూన రవికుమార్‌ సోదరుడు కుమారుడు రాజేష్‌ సబ్‌ లీజు తీసుకుని నడుపుతున్నారు. ఈ వ్యవహారం స్థానిక ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌కు ఇష్టం లేదన్న వాదనలు ఉన్నాయి. దీంతో స్థానికుల ముసుగులో ఈయన అనుచరులు అక్కడ తవ్వకాలను అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ నెల 10న గ్రావెల్‌ తవ్వకాలకు ఉంచిన పొక్లెయినర్‌ను అర్ధరాత్రి ఎమ్మెల్యే అనుచరులు వచ్చి ధ్వంసం చేశారని, అద్దాలు పగలుగొట్టి, రెండు బ్యాటరీలు, కొన్ని కేబుళ్లు పట్టుకు వెళ్లిపోయారని లీజుదారులు జేఆర్‌ పురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదే కొండలో గత వారం రోజులుగా ఎలాంటి అనుమతులు లేకుండా వేలాది గ్రావెల్‌ లోడ్లు హైవే పనులకు ఎలా తరలించారని, దీని వెనుక ఎవరున్నారని ఫిర్యాదుదారులు ప్రశ్నించారు. ఈ ఘటన జరిగిన రోజున ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో ఎన్‌ఈఆరే ఇదంతా చేశారని ప్రచారం జోరందుకుంది. ఇప్పుడిది ఎన్‌ఈఆర్‌కు ఇబ్బందికరంగా తయారైంది. దీంతో వ్యక్తిగత సమస్యను ఏకంగా అసెంబ్లీలో ప్రస్తావించారు.

ఇళ్లు, స్కూల్‌ ముందు వేసిన గ్రావెల్‌ సంగతేంటి?

ఎన్‌ఈఆర్‌ అసెంబ్లీలో ప్రస్తావించిన విషయాల్లో సంచాం కొండ గ్రావెల్‌కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో తనకెలాంటి సంబంధం లేదని చెప్పడం చర్చనీయాంశమైంది. ఆర్థిక వ్యవహారాల్లో సంబంధం లేదు సరే.. తన ఇళ్లు, స్కూల్‌ ముందు ప్రాంగణంలో ఉన్న లోతట్టు ప్రాంతాన్ని సమతలం చేసేందుకు తీసుకొచ్చిన గ్రావెల్‌ ఎక్కడిది? సంచాం కొండ నుంచి కాదా? తన ఇళ్లు, స్కూల్‌ ముందు టిప్పర్లతో అన్‌లోడ్‌ చేస్తున్నప్పుడు సంచాం కొండ నుంచి ఎలా తవ్వి తీసుకొస్తారు? అని స్థానికులు నిలదీసింది వాస్తవం కాదా? గ్రావెల్‌ లోడ్‌తో వచ్చిన టిప్పర్లను ఆ సిబ్బంది సంచాం కొండ నుంచి తీసుకొచ్చామని చెప్పింది నిజం కాదా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

సంచాం క్వారీలోని ధ్వంసమైన పొక్లెయినర్‌ (ఫైల్‌)

ఆధిపత్య పోరు

ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ముఖ్యంగా అంబేడ్కర్‌ యూనివర్సిటీ, ట్రిపుల్‌ ఐటీలో తాత్కాలిక ఉద్యోగుల తొలగింపు దగ్గరి నుంచి నియామకాల వరకు తన మాట చెల్లలేదని బీజేపీ ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావు ఆవేదనతో ఉన్నట్టు సమాచారం. ఎమ్మెల్యే కూన రవికుమార్‌ చెప్పినట్టుగానే అక్కడంతా నడిచిందన్న అభిప్రాయం ఉంది. అలాగే ఎచ్చెర్ల మండలంలో పలు భూ సమస్యలు, కేసులకు సంబంధించి కూడా ఎమ్మెల్యే కూన రవికుమారే అంతా తానై వ్యవహరిస్తున్నారని, తన మాటకు విలువ లేకుండా పోతుందన్న అభిప్రాయంతో ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఉన్నారన్న వాదనలు ఉన్నాయి. టీడీపీలో కింజరాపు అచ్చెన్నాయుడు వర్గమంతా ఎన్‌ఈఆర్‌ వైపు ఉండగా, కళా వెంకటరావు వర్గమంతా కూన రవికుమార్‌ వైపు ఉన్నారు. దీంతో ఆధిపత్య పోరు తప్పడం లేదు. తన నియోజకవర్గంలో కూన రవికుమార్‌ ఆధిపత్యం చెలాయించడం బీజేపీ ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌కు నచ్చడం లేదు. ఇక్కడేం జరిగినా తన కనుసన్నల్లోనే జరగాలని, తాను చెప్పినట్టే చేయాలని భావిస్తున్నారు. దీంతో ఈ ఇద్దరు నాయకుల మధ్య గ్యాప్‌ పెరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement