
కార్పొరేట్ల కోసమే పవర్ ప్లాంట్
● ఆలోచన విరమించుకోకుంటే తీవ్ర పరిణామాలు
● బహిరంగ సభలో థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు
సరుబుజ్జిలి/బూర్జ: పవర్ ప్లాంట్ నిర్మాణం పేరుతో కార్పొరేట్ శక్తులకు భూములు ధారాదత్తం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలు ఐకమత్యంగా తిప్పి కొట్టాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి, మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయకర్త వీఎస్ కృష్ణ పిలుపునిచ్చారు. సరుబుజ్జిలి, బూర్జ మండలాల పరిఽధిలో థర్మల్ వ్యతిరేక పోరాటకమిటీ ఆధ్వర్యంలో అడ్డూరిపేట వద్ద సోమవారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకరాపల్లి మాదిరిగా ఇక్కడ ప్లాంట్ జీఓను రద్దు చేయకుంటే ప్రాణాలైనా అర్పిస్తామన్నారు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్లాంట్‌ను రద్దు చేయించే బాధ్యత తీసుకోవాలని సూచించారు.
స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ గతంలో వెన్నెలవలస వద్ద కూనవారిపూలతోట పేరు మీదుగా తన భార్య పేరుపై 99 ఎకరాల భూమిని లీజు పేరుతో దక్కించుకోవాలని చూశారని థర్మల్ పోరాట కమిటీ కోశాధికారి అత్తులూరి రవికాంత్ తెలిపారు. ఇప్పుడు అన్ని చోట్లా తరిమికొట్టిన ప్లాంట్‌ను ఇక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నా రని విమర్శించారు. 20 గ్రామాల్లో 5వేల ఎకరాల్లో బంగారం లాంటి పంట భూములను కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి పెట్టే ప్రయత్నాలను తిప్పి కొ ట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు పిలుపునిచ్చారు. పవర్ ప్లాంట్ వస్తే భవిష్యత్‌తరాలు నాశనమవుతాయని పోరాట కమిటీ కన్వీనర్ సురేష్ దొర హెచ్చరించారు. ఇంటిలో కట్టెల పొయ్యి వల్ల కాలుష్యం జరుగుతుందని గ్యాస్ అందిస్తున్న ప్రభుత్వం థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనుకోవడం హాస్యాస్పదంగా ఉందని ప్రగ తి శీలా మహిళాసంఘం రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మి అన్నారు. జనం నెత్తిన బొగ్గుల కుంపటి పెట్టవద్దని సీపీఎం నాయకుడు శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐఎంఎల్ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, కార్గో ఎయిర్‌పోర్ట్ పోరాట కమిటీ అధ్యక్షుడు కొమర వాసు, రైతు కూలీ సంఘం నాయకుడు వంకల మాధవరావు, ఆదివాసీ పరిషత్ జిల్లా కార్యదర్శి సింహాచలం, పోరాట కమిటీ కార్యదర్శి సవర సింహాచలం, గురాడి అప్పన్న, మద్దిలి రామారావు, ఉదయభాస్కర్, తామాడ సన్యాసిరావు, కోత ధర్మారావు, బెలమలప్రభాకర్ పాల్గొన్నారు.