
ఛాయరాజ్ రచనలు స్ఫూర్తిదాయకం
శ్రీకాకుళం కల్చరల్: ఛాయరాజ్ రచనలు నేటితరానికి స్ఫూర్తిదాయకమని, ప్రజాసాహిత్యాన్ని, ప్రజాకళలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ప్రజాసాహితీ ఆధ్వర్యంలె ఛాయరాజ్ 13వ వర్ధంతి సభ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆదివారం జరిగింది. వర్తమాన సంక్షోభాలకు పరిష్కారాలు ఛాయరాజ్ కవిత్వంలో లభిస్తాయని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పల భానుమూర్తి అన్నారు. ముఖ్య వక్త సయ్యద్ సాబిర్ హుస్సేన్ మాట్లాడుతూ సమాజంలో నిర్బంధ అణిచివేత, అప్రకటిత ఎమర్జెన్సీ నిత్యకృత్యంగా మారిందని, ఇటువంటి వాటిని ఛాయరాజ్ తన కవిత్వం ద్వారా నిరసించారని గుర్తు చేశారు. సాహితీ స్రవంతి కన్వీనర్ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో సామాన్య ప్రజల స్థితిగతుల కోసం చాయారాజ్ ఆవేదన చెందారని అన్నారు. కవి సనపల నారాయణమూర్తి, రచయిత అట్టాడ అప్పలనాయుడు, ప్రజాసాహితీ ఎడిటర్ పి.ఎస్.నాగరాజు మాట్లాడుతూ చాయరాజ్ ప్రజా విప్లవ కవి అన్నారు. అనంతరం అరసం ప్రచురించిన కవితా స్రవంతి పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో చావలి శ్రీనివాస్, సదాశివ శంకరరరావు, జనసాహితీ ప్రధాన కార్యదర్శి పి.మోహనరావు, దాసరి రామ్మోహన్‌రావు, పీడీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మజ్జి మన్మోహన్, ఏఈటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ధవళ సరస్వతి, వి.నవీన్‌కుమార్, రంగారావు భాగవతార్, కె.గోవిందరావు, తాండ్ర అరుణ, ఛాయరాజ్ కుటుంబసభ్యులు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.