
గంజాయితో ఐదుగురు అరెస్టు
పలాస: మూడు కేసుల్లో ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు వ్యక్తులు గంజాయితో పట్టుబడినట్లు కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ ఆదివారం విలేకరులకు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం గొయిబంద గ్రామానికి చెందిన జిసియా గుంట, అతని భార్య స్వప్నబిబార్‌లు గుణుపూర్ నుంచి 40.240 కిలోల గంజాయిని రెండు ట్రాలీ బ్యాగుల్లో పట్టుకొని బస్సులో బయలుదేరి పలాసలో దిగారు. అక్కడి నుంచి నడుచుకుంటూ పలాస రైల్వేస్టేషన్‌కు వెళ్తుండగా కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. అలాగే తమిళనాడు రాష్ట్రం విజయరాఘవపురం గ్రామానికి చెందిన గాయిత్రి అనిఫ్, సుభాస్(అన్నా చెల్లెళ్లు) ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి పలాస బస్సులో వచ్చి రైల్వే స్టేషన్‌కు వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 28.860 కిలోల గంజాయి, సెల్‌ఫోన్, రూ.540 నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో ఒడిశా రాష్ట్రం కంటసారు గ్రామానికి చెందిన లలిత మజిహి, సంజయ్ కుమార్ సాహులు బరంపురం నుంచి బస్సులో పలాస వచ్చారు. అక్కడి నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 15.715 కిలోల గంజాయి, సెల్‌ఫోన్, రూ.470లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ నర్సింహమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.