
కన్నీటి ఎత్తిపోతలు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులకు తిప్పలు తప్పడం లేదు. ఎత్తిపోతల నీటిపారుదల పథకం ఇంజినీర్లకు, సిబ్బందికి నెలల తరబడి వేతనాలు అందించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ శాఖలో ఇంజినీర్ల స్థాయిని బట్టి ఈఈ, డీఈలకు సుమారు 9నెలలకు పైగా, ఏఈ, జేఈ, అటెండర్, కంప్యూటర్ ఆపరేటర్లకు మార్చి నెల నుంచి ఇప్పటివరకు జీతాలు ఇవ్వలేదు. కేవలం వర్షాలపై ఆధా రపడి పంటలు పండించే ప్రాంతంలోని వారికి ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందజేస్తారు. వీరు పనిచేస్తేనే రైతులు పంట పండించగలరు. రైతులు జీవితాల్లో వెలుగులు నింపే ఇంజినీర్ల బతుకుల్లో మాత్రం జీతాలు రాక చీకట్లు కమ్ముకుంటున్నాయి. దాదాపుగా ఏడాది కాలంగా జీతాల్లేక విధులు నిర్వహిస్తున్నారంటే వీరి సహనాన్ని కూటమి ప్రభుత్వం పరీక్షిస్తున్నట్లే. కుటుంబాలు ఎక్కడ రోడ్డున పడిపోతాయోనని భయంతో ఇప్పటి వరకు రోడ్డెక్కకుండా అలా విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి జీతాలు చెల్లిస్తే అప్పులు తీర్చగలుగుతామని చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు పాతవి, కొత్తవి 50కి పైగా ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. వీటిని పర్యవేక్షించే, భాద్యత ఇక్కడ పనిచేస్తున్న ఇంజినీర్లదే. ఎత్తిపోతల నీటిపారుదల పథకం శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఒకరు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఒకరు రెగ్యులర్ ప్రాతిపదికన ఉన్నారు. ఏఈలు ఒకరు, జేఈ ఒకరు ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్లు ఇద్దరు, అటెండర్స్ ఇద్దరు, వాచ్‌మెన్ ఒకరు పనిచేస్తున్నారు. వీరంతా గత ఏడాది కాలంగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నెలల తరబడి జీతాలకు నోచుకోని ఎత్తిపోతల ఇంజినీర్లు
స్థాయిని బట్టి వేతనాల చెల్లింపులో జాప్యం
కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులకు తప్పని తిప్పలు