
దస్తావేజు లేఖర్ల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన 2.0 ప్రైమ్ కార్డు విధానంలో సక్రమంగా విధులు నిర్వహిస్తున్నప్పటికి కూటమి ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చిందని, ఓటీపీలు పలుమార్లు రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని, ఈ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని దస్తావేజు లేఖర్లు, స్టాంప్ వెండర్లు కోరారు. ఈ మేరకు పెన్‌డౌన్‌లో భాగంగా జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శనివారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కక్షిదారులకు, స్టాంప్ వెండర్లకు, దస్తావేజు లేఖరులకు న్యాయం చేయాలని, సజావుగా సులభతరమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘ నాయకులు కింతలి రమణారావు, శ్రీనివాస పాత్రో, దామోదర మెహర్, కె.దుర్గాప్రసాద్, తాళ్లవలస కుమారస్వామి, తొగరాం భువనమోహన్, చింతనిప్పుల అప్పలరాజు, అన్నెపు సీతారాం, అల్లు రాజారావు, బలగ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.