తల్లీబిడ్డకు ప్రాణంపోశారు | - | Sakshi
Sakshi News home page

తల్లీబిడ్డకు ప్రాణంపోశారు

Sep 21 2025 1:07 AM | Updated on Sep 21 2025 1:07 AM

తల్లీ

తల్లీబిడ్డకు ప్రాణంపోశారు

టెక్కలి/మందస: పురిటి నొప్పులతో బాధపడుతున్న గిరిజన గర్భిణికి ప్రసవం చేసి తల్లీబిడ్డలకు 108 సిబ్బంది ప్రాణం పోశారు. మందస మండలం బంసుగాం గ్రామానికి చెందిన సవర రుక్మిణి పురిటి నొప్పులతో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు రిఫర్‌ చేశారు. శనివారం వేకువజామున 108 వాహనంలో గర్భిణిని తరలిస్తుండగా కోటబొమ్మాళి సమీపంలో పురిటి నొప్పులు అధికం కావడంతో 108 ఈఎంటీ దేవాది శ్రీనివాసరావు, పైలట్‌ మూగి దుర్గారావు తదితరులు వైద్య సేవలు అందజేసి ప్రసవం చేశారు. రుక్మిణి పాపకు జన్మనిచ్చింది. అయితే పాపలో చలనం లేకపోవడంతో సీపీఆర్‌ చేశారు. దీంతో చిన్నారి ఊపిరితీసుకోవడం ప్రారంభించింది. అనంతరం కోటబొమ్మాళి సామాజిక ఆసుపత్రిలో చేర్పించారు. 108 సిబ్బంది చేసిన సేవలకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

గాలికుంటు నివారణకు చర్యలు

నరసన్నపేట: జిల్లా వ్యాప్తంగా పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని పశు సంవర్థకశాఖ జేడీ రాజగోపాల్‌ అన్నారు. ఉర్లాం పశువైద్య కేంద్రాన్ని శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 3.30 లక్షల పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నామని చెప్పారు. ప్రతి ఆరు నెలలకు నిర్వహించే ఈ టీకాల కార్యక్రమాన్ని రెండు రోజుల క్రితం జిల్లాలో ప్రారంభించామని, ఇప్పటి వరకూ 20 వేల పశువులకు టీకాలు వేశామన్నారు. ఆస్పత్రుల వారీగా పశువులకు టీకాలు వేస్తున్నామని చెప్పారు. ఉర్లాం పశువైద్య కేంద్ర భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన భవనం నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈయన వెంట డీడీ బి.గణపతిరావు ఉన్నారు.

జాతీయ బాడీబిల్డింగ్‌ పోటీలకు లక్ష్మునాయుడు

ఎచ్చెర్ల : జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్‌ పోటీలకు ఎంపికై న స్థానిక రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఆంగ్ల ఉపాధ్యాయుడు డాక్టర్‌ రెడ్డి లక్ష్మునాయుడును ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ కె.వి.జి.డి.బాలాజీ శనివారం అభినందించారు. చండీగఢ్‌లో డిసెంబర్‌ 14, 15న జరిగే జాతీయ స్థాయి పోటీల్లోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు లక్ష్మునాయుడును ఆదర్శంగా తీసుకుని ఫిట్‌నెస్‌ సాధించాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌వో ముని రామకృష్ణ, అకడమిక్స్‌ డీన్‌ శివరామకృష్ణ, డాక్టర్‌ వాసు, గేదెల రవి, గణేష్‌, సాగర్‌, నూకేశ్వరరావు, రాకోటి శ్రీనివాసరావు, సాయిరాజు, పీఆర్‌వో మామిడి షణ్ముఖరావు, సిబ్బంది పాల్గొన్నారు.

మూడు పూరిళ్లు దగ్ధం

జి.సిగడాం: జాడ గ్రామంలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో మూడు పూరిళ్లు కాలిపోయాయి. గ్రామానికి చెందిన చల్లా అప్పయ్యమ్మ, చల్లా ఆదినారాయణ, పులపా నర్సింహులు కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలాయి. విలువైన సామగ్రి, తిండి గింజలు పూర్తి కాలి బూడిదయ్యాయి. సుమారు రూ. 4లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోతున్నారు. సమాచారం అందుకున్న రాజాం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పంచాయతీ కార్యదర్శి జాడ వెంకటన్నాయుడు, వీఆర్‌ఓ సంతోష్‌ కాలిపోయిన ఇళ్లను పరిశీలించారు.

తెలుగు తమ్ముళ్ల కుమ్ములాట

గార: తెలుగుదేశం పార్టీలో అంతర్గత కలహాలు బయటపడ్డాయి. గార మండం కె.సైరిగాం పంచాయతీలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యే నిర్వహించిన సమావేశంలో ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు. శనివారం శ్రీకూర్మంలోని ఓ ప్రైవేటు కల్యాణ మంటపంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ ఆధ్వర్యంలో ‘క్యాడర్‌ తో లీడర్‌’ కార్యక్రమంలో భాగంగా ఏడు పంచాయతీల క్యాడర్‌తో వేర్వేరుగా సమావేశం నిర్వహించారు. కె.సైరిగాం పంచాయతీ కార్యకర్తల సమావేశంలో సార్వత్రిక ఎన్నికల్లో పార్టీలో ముందు నుంచి ఉన్న నాయకులు, తర్వాత చేరిన నాయకుల మధ్య మాటల యుద్ధం జరిగి ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు. ఎమ్మెల్యే వారించే ప్రయత్నం చేసినా నాయకులు తగ్గకపోవడం గమనార్హం.

తల్లీబిడ్డకు ప్రాణంపోశారు 1
1/2

తల్లీబిడ్డకు ప్రాణంపోశారు

తల్లీబిడ్డకు ప్రాణంపోశారు 2
2/2

తల్లీబిడ్డకు ప్రాణంపోశారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement