
మండపాలకు ఉచిత విద్యుత్ బురిడీ
అరసవల్లి: జిల్లాలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన మండపాల సంఖ్య 1100పైగానే ఉంటుంది. కానీ మండపాలన్నింటికీ ఉచిత విద్యుత్ అని ప్రకటించిన ప్రభుత్వం.. ఉచితంగా కరెంటు ఇచ్చిన మండపాల సంఖ్య తెలుసా.. కేవలం 170. స్థానిక రాజకీయ సిఫారసులనే అర్హతగా చూసుకున్నారు. దీంతో పాటు ప్రభుత్వానికి ‘ఉచిత’ భారం పడకుండా తక్కువ సంఖ్యలోనే మండపాల నమోదు సంఖ్య ఉండేలా ముందుగానే జాగ్రత్తపడ్డారు. ఇప్పుడు దసరా మండపాలకూ అదే సూత్రం వర్తించేలా పనిచేస్తున్నారు.
విద్యుత్ శాఖకు రూ.7.71 లక్షల బిల్లులు
వినాయక చవితి సందర్భంగా తొమ్మిది రోజుల పాటు ‘అనుమతి’ పొందిన మొత్తం 170 మండపాల్లో విద్యుత్ వినియోగ లెక్కలు పరిశీలిస్తే.. మొత్తం శ్రీకాకుళం డివిజన్‌లో 36, పలాస డివిజన్‌లో 78, టెక్కలి డివిజన్‌లో 56 మండపాలనే గుర్తించారు. విద్యుత్ శాఖ లెక్కల ప్రకారం ఈ మొత్తం 170 మండపాల నుంచి రోజుకు 12,240 యూనిట్లు చొప్పున తొమ్మిది రోజులకు గాను మొత్తం 1,10,160 యూనిట్లు విద్యుత్ వినియోగించినట్లుగా గుర్తించారు. ఈ లెక్కన వినియోగ విద్యుత్ బిల్లుగా రూ.7,71,120 వచ్చినట్లుగా లెక్కలు కట్టారు. ఈ మేరకు ఈ ఉచిత భారమంతా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపిడిసిఎల్ డిస్కం)పై పడనుంది. అయితే ఈ రాయితీని రాష్ట్ర ప్రభుత్వమే డిస్కంకు చెల్లించాల్సి ఉంది.
నేటి నుంచి దసరా మండపాల గుర్తింపు
రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ప్రకటించిన విధంగా వినాయక చవితితో పాటు దసరా నవరాత్రులకు కూడా మండపాల నిర్వహణకు ‘ఉచిత’ విద్యుత్ విధానాన్ని అమలు చేయనున్నారు. దేవీశరన్నవరాత్రులు నేటితో ప్రారంభం కానున్న నేపధ్యంలో అనుమతుల కోసం జిల్లాలో అన్ని ప్రాంతాల నుంచి యువకులు, నిర్వాహక ప్రతినిధులు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో 30 మండలాల్లో కనీసంగా 300 నుంచి 500 వరకు దేవీనవరాత్రులను జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నింటికి ఉచిత విద్యుత్ వస్తుందో వేచి చూడాల్సిందే.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం దసరా నవరాత్రుల నిర్వహణ మండపాలకు కూడా ఉచిత విద్యుత్ అమలు చేయనున్నాం. సంబంధిత ప్రభుత్వ శాఖల అనుమతులు పొందిన మండపాలకు మాత్రమే ఈ రాయితీ ఉంటుంది. వినాయక చవితికి జిల్లాలో 170 మండపాలకు ఉచిత విద్యుత్ రాయితీని అమలు చేశాం.
– నాగిరెడ్డి కృష్ణమూర్తి,
ఎస్‌ఈ, విద్యుత్ శాఖ
నేటి నుంచి దసరా నవరాత్రుల
మండపాలకు అనుమతులు ప్రారంభం
దసరా మండపాలకూ ఉచిత విద్యుత్
గణేశ్ చవితికి 1100 మండపాలు పెడితే 170 మండపాలకే ఉచిత విద్యుత్
డిస్కంకు ప్రభుత్వం చెల్లించాల్సిన సొమ్ము రూ.7.71 లక్షలు

మండపాలకు ఉచిత విద్యుత్ బురిడీ