
అంత్యోదయ కార్డులో అక్రమాలు
● గిరిజనుడి రేషన్‌కార్డులో చేరి బియ్యం బుక్కేస్తున్న తెలుగుదేశం నేత
● లబోదిబోమంటున్న బాధితుడు
నందిగాం: తెలుగుదేశం నాయకులు చేస్తున్న అక్రమాలు రోజుకొకటి బయటకు వస్తున్నాయి. నిరుపేదలకు ఇచ్చే అంత్యోదయ రేషన్ కార్డులో అక్రమంగా తన పేరు చేర్చి ఆ కార్డుకు వచ్చే బియ్యాన్ని బుక్కేస్తున్న తెలుగుదేశం నాయకుడి లీలలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. నందిగాం మండలం హర్షబడ పంచాయతీ ముకుందాపురం గ్రామానికి చెందిన సవర మన్మధరావు అనే గిరిజనుడికి వైఏపీ 013064000173 నంబర్‌తో నిరుపేదలకు ఇచ్చే అంత్యోదయ రేషన్ కార్డు, 2801209354 నంబరుతో రైస్ కార్డు ఉండేది. దీని ద్వారా ప్రతి నెలా అందే 35 కిలోల బియ్యంతో కుటుంబం నెట్టుకొచ్చేది. 2017లో మన్మధరావు ఉపాధి కోసం చైన్నె వలస వెళ్లి అక్కడ నాలుగు నెలలు పని చేసి మరలా గ్రామానికి వచ్చాడు. రేషన్ కోసం డీలర్‌ను సంప్రదిస్తే కార్డు పరిధి మారిపోయిందని చెప్పడంతో బడగాం డీలర్‌ను సంప్రదించాడు. ఆ నంబరు కార్డులో బడగాం పంచాయతీ గనియాపేటకు చెందిన తెలుగుదేశం నాయకుడు గరుడాచలం తులసీదాస్ చేరి ఉన్నాడనే విషయం తెలిసింది. దీంతో తులసీదాస్ ఇంటికి వెళ్లి అంత్యోదయ కార్డులో తన ప్రమేయం లేకుండా చేరడం, డిపో మార్చడంపై నిలదీశాడు. అంతా నా ఇష్టమని, దిక్కున్న చోట చెప్పుకో అంటూ మన్మధరావును వెల్లగొట్టాడు. ఎన్నిసార్లు అడుగుతున్నా కార్డు ఇవ్వకుండా బెదిరిస్తుండటంతో శనివారం నందిగాం డిప్యూటీ తహసీల్దారు శంకరరావుకు ఫిర్యాదు చేశాడు. పరిశీలించి న్యాయం చేస్తామని డీటీ హామీ ఇచ్చారు. కాగా, ఇటీవల ప్రభుత్వం పంపిణీ చేసిన స్మార్ట్ రైస్‌కార్డులో కుటుంబపెద్దగా గరుడాచలం తులసీదాస్ ఉంటూ కుటుంబ సభ్యునిగా సవర మన్మధరావు పేరు ఉండటం గమనార్హం.

అంత్యోదయ కార్డులో అక్రమాలు