
కళాశాలల్లో ఆకస్మిక తనిఖీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు సమిష్టిగా పనిచేయాలని ఇంటర్మీడియెట్ విద్య జిల్లా వృత్తివిద్యాశాఖాధికారి రేగ సురేష్‌కుమార్ అన్నారు. మూడు వారాలుగా జిల్లాలోని రణస్థలం, జలుమూరు, నరసన్నపేట, నివగాం, ఆమదాలవలస, కొత్తూరు, హిరమండలం, కళింగపట్నం తదితర కళాశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. శనివారం కొయ్యాం ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీచేశారు. క్వార్టర్లీ పరీక్షలు రాస్తున్న విద్యార్థుల వద్దకు వెళ్లి జవాబుపత్రాలను పరిశీలించారు. అంతకుముందు కళాశాలకు చెందిన సైన్స్ ల్యాబ్, నాడు–నేడు పనులపై ఆరా తీశారు.
సకాలంలో సిలబస్ పూర్తిచేయాలి..
అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ కీర్తి తవిటినాయుడు, లెక్చరర్లతో సమావేశం నిర్వహించారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సిలబస్ సకాలంలో పూర్తిచేయాలని, ముఖహాజరు తప్పనిసరిగా నమోదు చేయాలని, శతశాతం విద్యార్థులకు కాలేజీలకు వచ్చేలా చొరవ తీసుకోవాలని, తరచూ విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడాలని, అవసరమైతే పిల్లల ఇళ్లకు వెళ్తుండాలని సూచించారు. అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి ప్రిన్సిపాల్‌తో కలిపి డీవీఈఓ స్వయంగా వడ్డించారు. కళాశాలలో వసతులు, సౌకర్యాలు, విద్యాప్రమాణాలు, సిబ్బంది పనితీరుపట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. కార్యక్రమంలో కళాశాల ఏజీఎంసీ సనపల షణ్ముఖరావు, ఎన్.ధర్మారావు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.