
రాష్ట్ర పండుగ
అరసవల్లి: కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలపై పెడుతున్న శ్రద్ధ నిధులు మంజూరు చేయడంలో చూపించడం లేదు. జిల్లాలో గత ఏడాది నుంచి రథసప్తమితో పాటు కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి అమ్మవారి సంబరాల ఉత్సవాలను రాష్ట్ర పండుగలంటూ ప్రకటించినా ఒక్క రూపాయి కూడా నిధులు విదల్చడం లేదు. రాష్ట్ర పండుగలంటూ ప్రకటనలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఆయా ప్రాంతాల్లో ప్రచారాలకు దిగుతున్నారు తప్ప ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం ఇవ్వడం లేదు. ప్రత్యేకంగా నిధులివ్వం.. సమీపంలో ఉన్న పెద్ద ఆలయాల నిధులను వెచ్చించి పండుగ చేస్కోండి..’ అంటూ అధికారిక ఉత్తర్వులు మాత్రం జారీ అయ్యాయి. గతేడాది లాగానే ఈ ఏడాది కూడా కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి అమ్మవారి సంబరాలు అందునా.. శతాబ్ది సంబరాల పేరిట ఈ నెల 23 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా విడుదలైన ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఎలాంటి ఆర్ధిక సహకారం ఉండదని తేల్చేసింది. దీంతో పేరు గొప్ప..ఊరు దిబ్బ అన్నట్లుగా సర్కార్ తీరుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలావుంటే ఈఏడాది రథసప్తమి మహోత్సవాలను కూడా తొలిసారిగా రాష్ట్ర పండుగ చేస్తున్నామని ప్రకటించి ఒక్క రూపాయి కూడా కూటమి ప్రభుత్వం విడుదల చేయలేదు. రాష్ట్ర పండుగ అంటూ..అలాగే ‘ప్రసాద్’ స్కాం వచ్చేస్తుందంటూ...ఆలయ పరిసరాల్లో ఉన్న అన్ని కట్టడాలను కూల్చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అరసవల్లి ఆలయ పరిసరాలన్నీ ఖాళీగానే దర్శనమిస్తున్నాయి.
మళ్లీ అరసవల్లి నుంచే..
రాష్ట్ర పండుగంటూ కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి అమ్మవారి ఆలయ శతాబ్ది సంబరాలను నిర్వహించనున్న నేపథ్యంలో రాష్ట్రం నుంచి ఆర్థిక సహకారం లేకపోవడంతో గౌరవ సాంప్రదాయాల భారమంతా అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి ఆలయ నిధులపై పడింది. గత ఏడాది కూడా ఇలాగే అరసవల్లి నుంచే సంప్రదాయక ఖర్చులన్నీ వెచ్చించింది. మళ్లీ ఇప్పుడు కూడా ఈ కొత్తమ్మతల్లి సంబరాల ప్రారంభ ఖర్చు, సంప్రదాయక ప్రక్రియలు, పట్టువస్త్రాలు, ప్రసాదాల ఖర్చు అంతా అరసవల్లి ఆలయంపైనే పడనుంది. అరసవల్లి ఆలయ డిప్యూటీ కమిషనర్/ఈఓ కె.ఎన్.వి.డి.వి. ప్రసాద్‌ను చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్‌గా నియమించి కొత్తమ్మతల్లి అమ్మవారి సంబరాల ప్రారంభ రోజున సంప్రదాయక ఉత్సవ నిర్వహణ, ప్రోటోకాల్‌తో పాటు పట్టువస్త్రాల సమర్పణ, గౌరవ లాంఛనాలు, ప్రసాదాల భారమంతా ఆదిత్యాలయ నిధుల నుంచే ఖర్చు చేయనున్నారు. రాష్ట్ర పండుగలంటూ నిధులివ్వకపోవడంపై గతేడాది కొత్తమ్మతల్లి సంబరాల నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా చర్చసాగుతోంది. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొత్తమ్మతల్లి ఉత్సవాలకు ఈ ఏడాది కూడా అరసవల్లి నుంచి పట్టు వస్త్రాలు, ప్రసాదాలను అమ్మవారికి సమర్పించనున్నాం. రాష్ట్ర పండుగగా కొత్తమ్మతల్లి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం చర్యలు చేపడుతున్నాం.
– కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్, ఈఓ,
సూర్యనారాయణ స్వామి ఆలయం, అరసవల్లి
ఒక్క రూపాయి కూడా విదల్చని సర్కార్
కొత్తమ్మతల్లి సంబరాల భారం మళ్లీ అరసవల్లికే..
ఆదిత్యుని నిధులతోనే పట్టువస్త్రాల సమర్పణ

రాష్ట్ర పండుగ

రాష్ట్ర పండుగ