
సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తీవ్రతరం
● రిలే దీక్షలకు దిగిన విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు
అరసవల్లి: తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ద్వారా విద్యుత్ పంపిణీ సంస్థలు తక్షణమే చర్యలు చేపట్టాలని, లేదంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని విద్యుత్ ఉద్యోగులు హెచ్చరించారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం శ్రీకాకుళం విద్యుత్ సర్కిల్ కార్యాలయం ఎదుట విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లను ప్లకార్డుల ద్వారా ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. విద్యుత్ పంపిణీ సంస్థలు మొండివైఖరి వీడి విద్యుత్ ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
శనివారం కూడా రిలే దీక్షలను కొనసాగిస్తామని జేఏసీ నేతలు ప్రకటించారు. కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు రమేష్, సుబ్రహ్మణ్యం, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.