
అంబేడ్కర్ వర్సిటీకి గ్రీన్ ఆడిట్ గుర్తింపు
ఎచ్చెర్ల : డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయానికి మొదటిసారి గ్రీన్ ఆడిట్ గుర్తింపు లభించింది. ఈ మేరకు జీసీ కన్సల్టెంట్ సర్వీసెస్ (గోరఖ్‌పూర్– ఉత్తరప్రదేశ్) వర్శిటీకి సమాచారం అందజేసింది. వచ్చే ఏడాది నాక్ పరిశీలనకు సన్నద్ధమవుతున్న అంబేడ్కర్ వర్సిటీ పలు గుర్తింపుల కోసం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా జీసీ కన్సల్టెంట్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ విశాశ్ శ్రీవాత్సవ్ నేతృత్వంలోని బృందం ఈ ఏడాది జూలై 22, 23 తేదీల్లో క్యాంపస్‌లో పర్యటించి వర్శిటీలోని బోధన, పరిపాలన, పరిశోధన, సేవలు, సౌకర్యాలు, పర్యావరణ సంబంధిత అంశాలను పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణకు వర్శిటీ తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను ప్రశంసిస్తూ గ్రీన్ ఆడిట్ యూనివర్శిటీగా గుర్తింపునిచ్చారు. అదే విధంగా, క్వాలిటీ, ఎన్విరాన్‌మెంట్, ఎనర్జీ, ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్స్, మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ కేటగిరీల్లో 2025 విద్యాసంవత్సరానికి ఐఎస్‌ఓ గుర్తింపునిస్తూ సర్టిఫికెట్ సైతం జారీచేశారు. వర్శిటీ ఐక్యూఏసీ విభాగం ఈ పర్యటనను పర్యవేక్షించి వారికి అవసరమైన పూర్తిస్థాయి సమాచారం అందజేశారు. కాగా వర్శిటీ ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్ రెడ్డి తిరుపతిరావు, సభ్యులు ఎన్.శ్రీనివాస్, జి.కిరణ్‌కుమార్, పి.మాధవరావులను వర్శిటీ వైస్ చాన్సలర్ కె.ఆర్.రజినీ శుక్రవారం ప్రత్యేకంగా అభినందించారు. నాక్ గుర్తింపు మరోసారి పొందేందుకు అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, ఆయా విభాగాలు పూర్తి సమాచారంతో సన్నద్ధం కావాలని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ బి.అడ్డయ్య, ప్రిన్సిపాళ్లు ఎస్.ఉదయభాస్కర్, ఎం.అనూరాధ, సీహెచ్ రాజశేఖరరావు, అకడమిక్ అఫైర్స్ డీన్ కె.స్వప్నవాహిని, ఎస్‌ఓ కె.సామ్రాజ్యలక్ష్మీ పాల్గొన్నారు.