
మొక్కజొన్నతో ఇథనాల్ ఉత్పత్తి
రణస్థలం: మొక్కజొన్న నుంచి ఇథనాల్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా సాగు చేసే రైతుల ఆదాయం మెరుగుపడుతుందని పెద్దాపురం వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఐ.సుధీర్ అన్నారు. లావేరు గ్రామంలో పెద్దాపురం వ్యవసాయ పరిశోధనా స్థానం, పైడిభీమవరం డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మొక్కజొన్న రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ ఇంధన అవసరాల దృష్ట్యా మొక్కజొన్న వంటి పునరుత్పాదక వనరులతో ఇంధనం ఉత్త్పత్తి చేస్తే పర్యావరణానికి మేలు కలగడమే కాక, మొక్కజొన్నకు డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయని చెప్పారు. మొక్కజొన్న విత్తే సమయంలో ఎరువులు వేయడం లేదని, శాస్త్రవేత్తల సిఫారసు మేరకు ఎరువుల వినియోగించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. అయితే మోతాదుకు మించి నత్రజని ఎరువులు వినియోగిస్తే సాగు ఖర్చులు పెరగడంతో పాటు పర్యావరణానికి హాని కలుగుతుందనే విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. మొక్కజొన్న పంట వ్యర్థాలను కాల్చడం వల్ల భూ సారం క్షీణిస్తుందని, దానికి బదులు పంట వ్యర్థాలను భూమిలో కలియదున్నాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ డిప్యూటీ మేనేజర్ ఆర్.హరిబాబు, సీనియర్ మేనేజర్ పి.తవిటినాయుడు, పెద్దాపురం పరిశోధన స్థానం సిబ్బంది హఫీజా, సమన్వయకర్తలు ఎస్.సాయిదుర్గ, ఐ.అనిల్‌కుమార్ పాల్గొన్నారు.