
రూ.1.66 లక్షల ఆర్థిక సాయం అందజేత
ఆమదాలవలస: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సీహెచ్ రంజిత్ కొద్ది నెలలుగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. వారి కుటుంబం ఆర్థికంగా వెనుకబడడంతో సరైన వైద్యం అందించలేని పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని గమనించిన కళాశాల అధ్యాపకులు విద్యార్థి పరిస్థితిపై చలించిపోయారు. ఈ మేరకు ఉదార హృదయంతో వారంతా కలిసి రూ.1.66 లక్షలు సేకరించి కళాశాల ప్రిన్సిపాల్ బి.శ్యామ్‌సుందర్ చేతులమీదుగా సోమవారం రంజిత్ కుటుంబానికి అందజేశారు. దీంతో వీరిని స్థానికులు అభినందించారు.
గంజాయితో ఆరుగురు అరెస్టు
ఆమదాలవలస: పట్టణంలోని వన్ వే ట్రాఫిక్ రోడ్ జంక్షన్ కండ్రపేట సమీపంలో గంజాయి తరలిస్తుండగా ఆరుగురు వ్యక్తులను ఆమదాలవలస పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఆమదాలవలస పోలీసులు దాడులు చేపట్టారు. దీనిలో భాగంగా శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్ నుంచి బయటకు వస్తున్న వ్యక్తులను పట్టుకొని ఆరా తీశారు. వారి వద్ద 15 గంజాయి చాక్లెట్లను గుర్తించినట్లు తెలిపారు. ఈ చాక్లెట్లు సుమారు 90 గ్రామాల బరువు ఉంటాయని పేర్కొన్నారు. దీంతో శ్రీకాకుళం సెవెన్ రోడ్డు జంక్షన్ సమీపంలోని సారంగడోల వీధికి చెందిన సిరిగిడి శ్రీనివాసరావు, కటుమల తరుణ్ కుమార్, బొబ్బోడి మణికృష్ణ, వంజరపు భార్గవ్, శ్రీకాకుళం దమ్మలవీధికి చెందిన ఫరీద్ ఖాన్, శ్రీకాకుళం రెల్లివీధికి చెందిన జలగడుగుల ప్రసాద్‌లను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.