
ఎరువు కోసం ఏకరువు
ఆమదాలవలస రూరల్:
అన్నదాతలు ఎరువు కోసం ఏకరువు పెడుతున్నారు. తొలివిడత ఎరువులు వేసేందుకు అన్ని గ్రామాల్లో రైతులు సిద్ధమవుతున్నా ఎరువుల కొరత అన్నదాతలను కంటతడి పెట్టిస్తోంది. సకాలంలో ఎరువులు అందించకపోవటంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పలు గ్రామాల రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ ఏడాది ఇలా ఉంటే వ్యవసాయం చేయటం కష్టమని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికార పార్టీ నాయకులకు ఎరువులు
రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందించే ఎరువులు కేవలం అధికార పార్టీ పాలకులకే అందాయి. రైతు సేవా కేంద్రాల్లో ఉండే రైతుల జాబితాలే ఇందుకు నిదర్శనం. ఆమదాలవలస మండలంలో 30 పంచాయతీలు ఉండగా ఈ పంచాయతీల పరిధిలో 5,160 హెక్టార్లు వరి సాగవుతోంది. దీనికి సుమారు 1000 మెట్రిక్ టన్నులు యూరియా అవసరం ఉండగా ఇప్పటి వరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా 574 మెట్రిక్ టన్నుల ఎరువు మాత్రమే అందించగలిగారు.
కొరత పేరిట దోపిడీ
కొందరు దుకాణదారులు కొర త పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. ఒక యూరియా ఎరువుల బస్తా సుమారు రూ. 280కు విక్రయించాల్సి ఉండగా ఒక ఎరువు బస్తాకు దుబ్బు గులుకులు ప్యాకెట్ లింకు పెట్టి రెండింటికి కలిపి రూ.600 లకు పైబడి తీసుకుంటున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. రైల్వే గూడ్స్ షెడ్ గోదాం అధికా రులతో కొందరు ఎరువుల దుకాణదారులు చేతులు కలిపి కృత్రిమ కొరత సృష్టించి రైతులు నుంచి అధిక ధరలు గుంజుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎరువుల కొరతపై ఆమదాలవలస వ్యవసాయ శాఖాధికారి మెట్ట మోహనరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా రైతులకు రెండో విడత అందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
అన్నదాతలకు తప్పని ఆందోళన
కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు
ఆమదాలవలస రైల్వే గోదాంలో ఉన్న నిల్వలు
పట్టించుకోని అధికారులు
దొంగ నిల్వలు
ప్రైవేటు వ్యాపారుల దుకాణాలకు అందించేందుకు రైల్వే గోదాంలలో కొందరు దొంగ నిల్వలు చేసి దొడ్డిదారిన తరలిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. కేవలం అధికారులు ప్రైవేటు దుకాణ యజమానుల వద్ద నుంచి కమీషన్ల కోసమే అడ్డదారులు తొక్కుతున్నారని రైతులు విమర్శిస్తున్నారు.

ఎరువు కోసం ఏకరువు

ఎరువు కోసం ఏకరువు