
మంత్రి అచ్చెన్న వ్యాఖ్యలు హాస్యాస్పదం
టెక్కలి: జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత లేకుండా చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇటీవల ప్రకటన చేయడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ అన్నారు. టెక్కలిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎంతమంది రైతులకు యూరియా, డీఏపీతో పాటు ఇతర కాంప్లెక్స్ ఎరువుల అవసరమో కనీసం మంత్రికి అవగాహన లేకపోవడంతో, ఇప్పుడు ఎరువుల కొరత ఏర్పడిందన్నారు. నివేదిక అందజేయాల్సిన అధికారులు సైతం మంత్రి భజన చేసుకున్నారు తప్ప, క్షేత్రస్థాయిలో రైతులకు అవసరమైన ఎరువులపై దృష్టి సారించలేదని మండిపడ్డారు. సహకార సొసైటీల ముసుగులో గ్రామాల్లో అధికార పార్టీ కార్యకర్తలు విచ్చలవిడిగా ఎరువుల దోపిడీ చేసుకున్నారని దుయ్యబట్టారు. టెక్కలి నియోజకవర్గంలో అధికార పార్టీ కార్యకర్తలు మీతిమీరిన ఎరువుల దోపిడీ చేశారని ఆరోపించారు.
నామమాత్రంగానే తనిఖీలు
రైతులు ప్రైవేట్ డీలర్ల వద్దకు వెళ్తే అక్కడ యూరియా, డీఏపీ కావాలంటే అదనంగా మరికొన్ని కలుపు మందులు, గుళికలు కొనాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారని, దీనిపై అధికారులు నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారని తిలక్ మండిపడ్డారు. మరోవైపు శివారు ప్రాంతాలకు సాగునీరు అందేవిధంగా ఎక్కడా మదుములు, చప్టాలు, షట్టర్లు బాగు చేయలేదన్నారు. వర్షాలు పడే మునుపు అరకొరగా బిల్లుల కోసం పనులు చేసుకున్నారని ఆరోపించారు. రైతులకు ఎంతో ఉపయోగకరమైన రైతు భరోసా కేంద్రాలను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే 15 రోజుల్లోగా రైతులకు అవసరమైన ఎరువులు, సాగునీరు అందజేయకపోతే చేతకాని మంత్రినని అచ్చెన్నాయుడు ప్రకటన చేసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే అధికారులు స్పందించకపోతే టెక్కలి వ్యవసాయ శాఖ ఏడీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ నాయకులు కె.అజయ్‌కుమార్, వి.శ్రీధర్‌రెడ్డి, పి.రమణబాబు, పి.వైకుంఠరావు, డి.ధర్మారావు, పి.బాలకృష్ణ, ఎస్.వినోద్, బి.కార్తీక్, ఎస్.జగదీష్, జి.శ్యామలరావు, డి.శ్రీను, పి.శివ, పి.రాము, ఎస్.బాలకృష్ణ, కె.కనకరాజు, సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ కార్యకర్తలు ఎరువుల దోపిడీ చేశారు
రైతులకు ఎరువులు ఇవ్వకపోతే ధర్నా చేస్తాం
ధ్వజమెత్తిన పేరాడ తిలక్