
వివిధ రకాల రాఖీలు, వెండీ రాఖీలు, మార్కెట్ రాఖీల అమ్మకం
శ్రీకాకుళం కల్చరల్: శ్రావణ మాసంలో జరుపుకునే రాఖీ పండగ ఎంతో ప్రత్యేకమైనది. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఈ పండగను ఆనందోత్సాహాల నడుమ జరుపుకుంటారు. ఆచార వ్యవహారాల్లో మిగిలిన పండగలకు తేడాలున్నా, దేశమంతా ఒకేరోజు, ఒకేవిధంగా జరుపుకునే ఏకై క పండగ రాఖీ పండగ. ఆడపడుచులంతా తమ సోదరులకు హారతి ఇచ్చి సర్వకాల సర్వావస్థల్లో రక్షగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ రాఖీలను కడతారు. తర్వాత పిండి వంటలతో సోదరుడికి భోజనం పెడతారు. ఇక రాఖీ కట్టిన సోదరుడు తన తాహతుకు తగ్గట్టుగా కానుకలిస్తారు. ఆడపడుచులు తమ తోబుట్టినవారితో కలసి ప్రేమానురాగాలు పంచుకుంటారు.
ట్రెండీ రాఖీల సందడి
ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా ఆన్‌లైన్‌లో రాఖీల అమ్మకాలు జోరందుకున్నాయి. కొత్తదనం కోరుకనేవారికి ఈ రాఖీలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. రాఖీల మీద సోదరుడి పేరు, ఫొటోలతో రాఖీలు తయారు చేస్తున్నారు. అలాగే రుద్రాక్షలు, వివిధ రకాల విత్తనాలు, దేవుడి బొమ్మలు, బ్రేస్‌లెట్ రాఖీలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. అలాగే రాఖీ పురస్కరించుకొని వీధుల్లోనూ దుకాణాలు విరివిగా వెలశాయి. మార్కెట్లో ఎన్నో రకాల ప్లాస్టిక్ పూలతో అందంగా, ఆకర్షణీయంగా తయారు చేసిన రాఖీలను అమ్ముతున్నారు. రూ.25 నుంచి రూ.1000ల వరకు ధరలు కలిగినవి మార్కెట్లో అమ్మకానికి ఉన్నాయి.