
సెల్‌ఫోన్ దుకాణంలో చోరీ
పలాస: కాశీబుగ్గ కేటీ రోడ్డు బాలాజీ సెల్‌ఫోన్ దుకాణంలో మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దుకాణంలో ఉన్న రూ.1.20 లక్షల నగదును అపహరించారు. కాశీబుగ్గ పోలీసులు, బాధితుల కథనం మేరకు.. పలాస మండలం బ్రాహ్మణతర్లా గ్రామానికి చెందిన నిమ్మన షణ్ముఖరావు కాశీబుగ్గ రోడ్డులో బాలాజీ సెల్‌ఫోన్ సర్వీసింగ్ సెంటర్ గత 15 ఏళ్లుగా నడిపిస్తున్నాడు. గత రెండు నెలలుగా సెల్‌ఫోన్ సర్వీసింగ్ దుకాణం ముందు తాత్కాలిక టిఫిన్ దుకాణం కూడా పెట్టారు. ఇదిలా ఉండగా బుధవారం ఉదయం 6 గంటల సమయంలో టిఫిన్ దుకాణం తెరిచేందుకు షణ్ముఖరావుతో పాటు వాళ్ల అన్నయ్య యువరాజ్ రాగా సెల్‌ఫోన్ దుకాణానికి వేసిన తాళాలు పగలగొట్టి ఉండడాన్ని గమనించారు. దీంతో లోపలికి వెళ్లి చూడగా సర్వీసింగ్ దుకాణంలో ఉన్న రూ.1.20 లక్షలు చోరీ జరిగినట్లు గుర్తించి కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ, శ్రీకాకుళం క్లూస్ టీం వెళ్లి వేలిముద్రలను సేకరించారు. అలాగే పలాసలో నివాసం ఉంటున్న జినగ గోపాల్‌కు సంబంధించిన టైలరింగ్ దుకాణంలో కూడా చోరీ జరిగింది. మూడు జతల దుస్తల దొంగతనం జరిగినట్లు బాధితుడు తెలిపాడు. అక్కడ కూడా క్లూస్ టీం వేలుముద్రలను సేకరించారు. వీటిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ చెప్పారు.