
ఇదేనా విద్యుత్ చార్జీలు తగ్గించడం..?
● ప్రభుత్వంపై విరుచుకుపడిన జిల్లా వామపక్ష పార్టీల నేతలు
అరసవల్లి: వినియోగదారునికి దగా చేసే స్మార్ట్ మీటర్లు వద్దు..ట్రూ అప్ చార్జీల భారం వద్దంటే వద్దంటూ జిల్లా వామపక్ష పార్టీ నేతలు నిరసనకు దిగారు. స్థానిక విద్యుత్ సర్కిల్ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించి పెరిగిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని, అలాగే స్మార్ట్ ఒప్పందాలను రద్దు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భాగంగా సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సీపీఐఎంఎల్ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ తదితరులు మాట్లాడుతూ ఎన్నికల ముందు అదానీ కంపెనీ వాళ్ల స్మార్ట్ మీటర్లను బిగిస్తామని వచ్చినప్పుడు ఆ మీటర్లు బద్దలుకొట్టాలంటూ పిలుపునిచ్చిన నారా లోకేష్‌కు, ఇప్పుడెందుకు స్మార్ట్ మీటర్లను వద్దనడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికే ప్రభుత్వం పెంచిన ట్రూ అప్ చార్జీలు, సర్‌చార్జీలు అదనపు భారంగా విద్యుత్ బిల్లులు భారీగా షాకిస్తుంటే వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారన్నారు. ఇది చాలదన్నట్లుగా మరో రూ.12,771 కోట్ల భారాన్ని అదనపు చార్జీల పేరిట జనం నెత్తిన వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్నో ప్రకటనలు చేశారని, అసలు విద్యుత్ చార్జీలు పెంచబోనని, వీలు ప్రకారం తగ్గిస్తానంటూ ప్రకటనలు గుప్పించి అధికారంలోకి వచ్చారని...ఇప్పుడు తొలి ఏడాదిలోనే దారుణంగా విద్యుత్ చార్జీలు పెంచారని గుర్తు చేశారు. ఇదేనా తగ్గించడమంటే అంటూ విమర్శించారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని రద్దు చేసుకునేలా చర్యలు చేపట్టాలని, లేదంటే ఉద్యమిస్తామని వామపక్ష పార్టీలు హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నేతలు కొత్తకోట అప్పారావు, ఎం.గోవర్ధనరావు, ఆర్.ప్రకాష్, బి.సింహాచలం, ఆదినారాయణమూర్తి, వెంకటరావు పాణిగ్రహి, ఎ.లక్ష్మి, శ్రీదేవి పాణిగ్రాహి. కె.చంద్రశేఖర్ పాల్గొన్నారు.