
అధికార లాంఛనాలతో డీఎస్పీ అంత్యక్రియలు
పోలాకి: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన డీఎస్పీ శాంతారావు అంత్యక్రియలు ఆయన స్వగ్రామం డోలలో ఆదివారం అధికార లాంఛనాలతో నిర్వహించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీ మహేశ్వరరెడ్డి తోపాటు పలువురు పోలీస్ ఉన్నతాధికారు లు, ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తోపాటు పలువు రు రాజకీయ నాయకులు, బంధువులు, స్థానికులు హాజరై నివాళులర్పించారు. ఎస్‌ఐ రంజిత్ సమక్షంలో పోలాకి మండల కేంద్రం నుంచి డోల వరకు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి బందోబస్తు చేపట్టారు. ఎస్పీతో సహా అక్కడకు వచ్చిన పోలీసులంతా ఆయనకు నివాళులర్పించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ డోలలో డీఎస్పీ జల్లు శాంతారావు కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. శాంతారావు కుమారులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం అదే గ్రామంలో ఇటీవల మృతిచెందిన ఎల్‌ఐసీ ఏజెంట్ ఎన్ని రమణ కుటుంబాన్ని కృష్ణదాస్ పరామర్శించారు. ఆయనతోపాటు మండలపరిషత్ సలహాదారు ముద్దాడ భైరాగినాయుడు, పార్టీ నాయకులు డోల సాయిరాం తదితరులు ఉన్నారు.

అధికార లాంఛనాలతో డీఎస్పీ అంత్యక్రియలు