
టీకా..లేదుగా
అరసవల్లి:
అప్పుడే పుట్టిన బిడ్డలకు ఓపీవీ జీరో వ్యాక్సిన్ వేయాలి.. కానీ జిల్లాలో అది అందుబాటులో లేదు. బీసీజీ వేయాలి.. అది కూడా లేదు. హెపటైటిస్–బి (బర్త్‌డోస్) ఎప్పుడు వస్తుందో తెలీదు. ఆరు వారాల నుంచి ఏడాది లోపు బిడ్డలకు ఓపీవీ–1 తప్పనిసరి. కానీ రెండు నెలలుగా ఇవి రాలేదు. ఎఫ్‌ఐపీ, రోటా వైరస్ వ్యాక్సిన్లు కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఏడాదిన్నర నుంచి ఆరేళ్ల్ల లోపు చిన్నారులకు కోరింత దగ్గు, డిఫ్తీరియా, టెటానస్‌ల నుంచి రక్షణకు డీపీటీ బూస్టర్ వ్యా క్సిన్లు వేయాలి. కానీ ఎప్పుడూ నో స్టాక్ బోర్డు వెక్కిరిస్తూనే ఉంది. జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా ఉంది. టెక్కలి జిల్లా కేంద్రాస్పత్రి నుంచి నరసన్నపేట ఏరియా ఆస్పత్రి, కమ్యూనిటీ ఆస్పత్రులతో పాటు పీహెచ్‌సీల్లోనూ ఈ కొరత కనిపిస్తోంది. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలిలోనే వ్యాక్సిన్లు లేవు. జిల్లాలో సర్వజన ఆస్పత్రి (శ్రీకాకుళం), జిల్లా ఆస్పత్రి (టెక్కలి), ఏరియా ఆస్పత్రి (నరసన్నపేట), 13 సీహెచ్‌సీలతో పాటు 71 పీహెచ్‌సీలు, 13 అర్బన్ పీహెచ్‌సీలు ఉన్నాయి. వీటికి కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి వచ్చే వ్యాక్సిన్లను జిల్లా వ్యాక్సినేషన్ కేంద్రం నుంచి సరఫరా చేస్తారు. ఆయా ఆరోగ్య కేంద్రాల అధికారులు పంపిన ఇండెంట్ల ప్రాప్తికి వ్యాక్సిన్లను ప్రతి నెలా పంపిస్తుంటారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్లక్ష్య ధోరణి కారణంగా సకాలంలో మందుల నుంచి వ్యాక్సిన్ల సరఫరాల వరకు ఏవీ సవ్యంగా జరగడం లేదనే చర్చ జరుగుతోంది. రెండు నెలలుగా ఇంటెండ్లు పెడుతున్నా వ్యాక్సిన్లు మాత్రం రావడం లేదు.
నేషనల్ ఇమ్యూనైజేషన్ షెడ్యూల్ ప్రకారం అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 16 ఏళ్ల అమ్మాయిలు, గర్భిణులకు కూడా వ్యాక్సిన్లు షెడ్యూల్ ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం రెండు నెలల నుంచి జిల్లాలో జిల్లా ఆస్పత్రి నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు ఎక్కడా వ్యాక్సిన్లు అందుబాటులో లేకుండా పోయాయి. ఇప్పటికై నా ప్రభుత్వ ఉన్నతాధికారులు దృష్టి సారించి వ్యాక్సిన్ల కొరత సమస్యలను పరిష్కరించాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
త్వరలో సరఫరా జరిగేలా చర్యలు
జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ ఇచ్చిన వివరాల మేరకు గత రెండు నెలల నుంచి కొన్ని వ్యాక్సిన్లు మాత్రం సరఫరా జరగలేదన్న సంగతి నా దృష్టికి వచ్చింది. అయితే వ్యాక్సిన్లు అన్నీ కేంద్రం ఇవ్వాల్సి ఉంది. కొరత ఉన్న వ్యాక్సిన్లను త్వరలోనే జిల్లాలో అన్ని ఆస్పత్రులకు సరఫరా అయ్యేలా చర్యలు చేపడుతున్నాం.
– డాక్టర్ అనిత, డీఎంహెచ్‌ఓ
ప్రభుత్వాస్పత్రులను టీకాల కొరత వేధిస్తోంది. పిల్లలకు వ్యాక్సిన్ వేయిద్దామని వచ్చే తల్లిదండ్రులకు వాయిదాల దండకం వినిపిస్తోంది. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఐదేళ్ల పిల్లల వరకు పలు రకాల టీకాలు తప్పనిసరిగా సకాలంలో వేయించాలి. కానీ జిల్లాలో టీకాల కొరత కారణంగా రెండు నెలలుగా చాలా మంది పిల్లలకు వ్యాక్సిన్లు వేయలేదు.
జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో
అందుబాటులో లేని వ్యాక్సిన్లు
రెండు నెలలుగా తీవ్రంగా వేధిస్తున్న కొరత
పిల్లలకు వ్యాక్సిన్లు వేయించలేక
తల్లిదండ్రుల పాట్లు

టీకా..లేదుగా

టీకా..లేదుగా