సోంపేట ఉద్యమం
● ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలి
● సినీ దర్శకుడు, నటుడు ఆర్.నారాయణమూర్తి
● చిత్తడి నేలలపై పుస్తకం ఆవిష్కరణ
సోంపేట: చిత్తడి నేలల సంరక్షణ కోసం సోంపేట థర్మల్ పవర్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా ప్రజలు చేసిన ఉద్యమం ఆదర్శనీయమని సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. సోంపేట థర్మల్ ఉద్యమంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెంది 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పర్యావరణ పరిరక్షణ సంఘం అధ్యక్షుడు డాక్టర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో సంస్మరణ సభ బారువలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద ఆర్.నారాయణమూర్తి, ఎమ్మెల్యే బి.అశోక్, పర్యావరణ పరిరక్షణ సంఘ అధ్యక్షుడు డాక్టర్ కృష్ణమూర్తి తదితరులు నివాళులర్పించారు. అనంతరం థర్మల్ స్థూపం ఆవరణలో మొక్కలు నాటారు. చిత్తడి నేలల ప్రాశస్త్యం తెలియజేస్తూ పుస్తకాన్ని ఆర్.నారాయణమూర్తి ఆవిష్కరించారు.
ఉత్తరాంధ్ర కోసం ఉద్యమం చేయాలి
ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అన్ని రంగాల్లో వెనుకబడి ఉందన్నారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయకపోతే సోంపేట ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకుని, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఇంకో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45 అడుగులు తప్పనిసరిగా ఉండాలన్నారు. 45 అడుగుల కంటే తగ్గిస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆలోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకొని, ఆంధ్రుల హక్కును కాపాడాలని కోరారు. విశాఖ రైల్వే జోన్ ప్రకటనలకే పరిమితం అవుతోందని, జోన్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఒడిశా రాష్ట్రానికి కేటాయించడం సరికాదన్నారు. టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన 329 జీవో రద్దు చేసి, ఈ ప్రాంతాన్ని సురక్షిత ప్రాంతంగా గర్తించాలి విన్నవించారు. మానవ హక్కుల సంఘం నాయకుడు వీఎస్ కృష్ణ మాట్లాడుతూ జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును ప్రభుత్వాలు బుట్ట దాఖలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమదాలవలసలో ఏర్పాటు చేయనున్న థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేఖత ఉందని తెలియజేశారు. అక్కడి ప్రజలు సోంపేట ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకుని ఉద్యమం చేపట్టడానికి సిద్ధమవ్వడం జరుగుతోందన్నారు. ఉద్దానం ప్రాంతంలో కార్గో ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయడం వలన ఈ ప్రాంతంలోని కిడ్నీవ్యాధులు నయమవుతాయా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యోగ, ఉపాధి పేరిట ప్రజలను మోసం చేసి కార్పొరేట్ కంపెనీలకు పచ్చని భూములు ధారాదత్తం చేసే కుట్రలకు ప్రభుత్వాలు పాల్పడుతున్నాయని ధ్వజమెత్తారు. పాలకులు తీరు మార్చుకుని పర్యావరాణాన్ని కాపాడాలని కోరారు.
చిత్తడి నేలలతో మేలు
చిత్తడి నేలలతో పర్యావరణానికి మేలు జరుగుతుందని పర్యావరణ పరిరక్షణ సంఘం అధ్యక్షుడు డాక్టర్ కృష్ణమూర్తి అన్నారు. పర్యావరణం పరంగా చిత్తడి నేలలు గుప్తనిధి వంటివన్నారు. బీల ప్రాంతంలో నివసిస్తున్న జీవరాశులకు పర్యావరణ పరంగా ఓ ప్రత్యేకత ఉందని పేర్కొన్నారు. మానవ శరీరంలో మూత్రపిండాలు ఎటువంటి ముఖ్యపాత్ర పోషిస్తున్నాయో, అలాగే భూమి తల్లికి చిత్తడి నేలలు అటువంటివన్నారు. ఇటువంటి వాటిని కాపాడడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మాజీ జెడ్పీటీసీ సూరాడ చంద్రమోహన్ మాట్లాడుతూ బీల ప్రాంతంలో ఎకో టూరిజం ప్రోత్సహించడం ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో బారువ సర్పంచ్ యర్ర రజని, ప్రముఖ కవి జయరాజ్, మానవ హక్కుల సంఘ నాయకులు కేవీ జగన్నాథరావు, మత్స్యకార నాయకులు బడే తమ్మయ్య, బట్టి మాధవరావు, కళాసీ సంఘం అధ్యక్షుడు లోకనాథం, పర్యావరణ నాయకుడు సనపల శ్రీరామమూర్తి, బార్ల సుందరరావు, కూన రాము, బత్తిన లోకనాథం, పాల్గుణరావు, హేమసుందరరావు, సోమేష్ తదితరులు పాల్గొన్నారు.
దర్శనీయం