దేవుడి మీద కోపంతో..! | - | Sakshi
Sakshi News home page

దేవుడి మీద కోపంతో..!

Jul 15 2025 6:45 AM | Updated on Jul 15 2025 6:45 AM

దేవుడి మీద కోపంతో..!

దేవుడి మీద కోపంతో..!

శ్రీకాకుళం క్రైమ్‌: భార్య మొదటిసారి కాన్పులోనే మగబిడ్డను పోగొట్టుకున్నాడు.. మరోమారు గర్భిణిగా ఉండేటప్పుడే భార్య కడుపులో పిండం పోయింది. ఈ క్రమంలో ఆ వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. విసిగివేసారిన భార్య సైతం తననొదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. తీవ్ర మనస్తాపానికి గురైన ఆ వ్యక్తి తనకు దేవుడు అన్యాయం చేశాడని, శివుడు అనేవాడే లేడని, సొంత గ్రామంలోనే ఉన్న నవగ్రహ ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేసేశాడు. జిల్లాలోని జి.సిగడాం మండలం దాలంరాజువలస గ్రామంలో ఈనెల 11న జరిగిన ఈ ఘటనకు సంబంఽధించి నిందితుడు వేముల రామకృష్ణ సోమవారం పోలీసులకు పట్టుబడ్డాడు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఈ మేరకు విలేకరుల సమావేశం నిర్వహించారు.

గ్రామస్తుల సమాచారంతోనే..

దాలంరాజువలస గ్రామంలో శివాలయం పక్కనే ఉన్న నవగ్రహ విగ్రహాలను ఈనెల 11వ తేదీన రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు విరగ్గొట్టారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు జి.సిగడాం పోలీసులు ప్రత్యేక బృందాల సాయంతో దర్యాప్తు చేపట్టారు. గ్రామస్తుల సమాచారంతో రామకృష్ణను అనుమానితుడిగా భావించిన పోలీసులు ఆధారాలు సేకరించారు. 1999లో రామకృష్ణకు వివాహమైందని, భార్య 2022లో విడిచిపెట్టి పుట్టింటికి వెళ్లిపోయిందని తెలుసుకుని కారణాలపై ఆరా తీశారు.

మద్యం సీసానే పట్టించింది

ఈనెల 11వ తేదీన ఉదయం కార్పెంటర్‌ నారాయణ పని ఉందని రమ్మని చెప్పి రామకృష్ణకు రూ.300లు ఇచ్చాడు. అదేరోజు రాత్రి 7.10 గంటలకు సర్వేశ్వరం గ్రామ కూడలిలో ఉన్న మద్యం షాపునకు రామకృష్ణ వెళ్లి రెండు క్వార్టర్ల మద్యం బాటిళ్లు కొన్నాడు. అందులో ఒకటిన్నర బాటిల్‌ తాగి రాత్రి 10 గంటలకు శివాలయం వద్దకు పడుకోవడానికి వెళ్లాడు. మిగిలిన హాఫ్‌ క్వార్టర్‌ బాటిల్‌ మద్యం తాగేందుకు నవ గ్రహాలయం పక్కన ఉన్న వాటర్‌ ట్యాప్‌ నుంచి వాటర్‌ పట్టుకున్నాడు. అనంతరం మద్యం మత్తులో పక్కనే ఉన్న ఇనుప రాడ్డు తీసుకుని ఆలయం లోపలికి ప్రవేశించాడు. శని దేవుడు శని పట్టుకోవడం వలనే జీవితం పోయిందని అక్కడ ఉన్న తొమ్మిది విగ్రహాలను ఇనుప రాడ్డుతో విరగ్గొట్టాడు. మిగిలిన హాఫ్‌ మందు తాగి శివాలయంలోనే పడుకుని ఉదయం 5 గంటలకు లేచి ఎదురుగా ఉన్న పొదల్లో బాటిల్‌ను పడేసి, ఇనుప రాడ్డును దూరంగా ఉన్నపొదల్లో దాచాడు. పోలీసులకు దొరికిన ఆ బాటిల్‌ సర్వేశ్వరం జంక్షన్‌లో ఉన్న మద్యం షాపులోనే దొరుకుతుందని అక్కడికి వెళ్లి సీసీ ఫుటేజీ వెరిఫై చేసి ఆరా తీయడం, బాటిల్‌పై ఫింగర్‌ ప్రింట్స్‌ బట్టి నిందితుడు రామకృష్ణ అనే నిర్ధారణకొచ్చారు. 2022లో అదే గుడిలో పూజారి అయ్యప్ప మాల వేసిన సమయంలో దేవుని పటాలను పగలగొట్టడంతో రామకృష్ణపై కేసు ఉందన్నారు. రామకృష్ణ, పూజారి ఇద్దరూ కలిసి మద్యం సేవించే సందర్భాలు అనేకమని, కాకపోతే ఈ కేసులో పూజారి పాత్ర లేదని ఎస్పీ స్పష్టం చేశారు.

మద్యం మత్తులో విగ్రహాల ధ్వంసానికి పాల్పడిన వ్యక్తి అరెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement