
అలా తేల్చేయడం ఏకపక్షం..
శ్రీకాకుళం క్రైమ్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఫరీదుపేట వైఎస్సార్ సీపీ కార్యకర్త సత్తారు గోపి హత్యోదంతాన్ని పోలీసులు పూర్తిగా పక్కదోవ పట్టిస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తిగా రాజకీయ కోణంలో జరిగిన ఈ హత్యను భార్యాభర్తల తగువులో భాగమని పోలీసులు చెప్పడం కూడా రాజకీయమేనని అన్నారు. పోలీస్ రూల్ బుక్ రా జ్యాంగం ప్రకారం పనిచేయడం లేదని, షాడో ముఖ్యమంత్రి లోకేష్ రెడ్‌బుక్ ప్రకారం నడుస్తోందని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నామని టీడీపీ నాయకులు ఇలా హత్యలు, దాడులు, దౌర్జ న్యాలకు పాల్పడితే భవిష్యత్‌లో వారికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఎస్పీ కి ఫిర్యాదు చేసేందుకు కృష్ణదాస్, సీదిరితో పాటు ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్, ఆమదాలవలస, టెక్కలి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జులు చింతాడ రవి, పేడాడ తిలక్, నాయకులు బొడ్డేపల్లి రమేష్, ఫరీదుపేట గ్రామస్తులు వచ్చారు. అనంతరం విలేకరుల సమావేశంలో కృష్ణదాస్, సీదిరి అప్పలరాజు మాట్లాడారు.
ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ.. తమ కార్యకర్త గోపి హత్య చాలా దారుణమని, అతని డ్రైవర్ ప్రసాద్‌ను హత్య చేసినప్పుడు పోలీసులు సరైన చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడీ హత్య జరిగేది కాదన్నారు. పోలీసుల తీరుకు నిరసనగా నే బ్లాక్‌షర్ట్ వేసుకుని వచ్చానని, రాష్ట్రమంతా ఇదే దౌర్భాగ్యం నడుస్తోందని, నిన్నటికి నిన్న మహిళా జెడ్పీ చైర్‌పర్సన్‌పై సైతం ఇదే తరహాలో దాడిచేయడం దురదృష్టకరమన్నారు. వరుస హత్యల పై వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి చెప్పామని, సత్తారు గోపి కుటుంబానికి అండగా ఉంటామన్నారు.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడు తూ.. ఇదో పైశాచిక హత్య అని, పార్టీలో క్రియాశీలకంగాను, కిరణ్‌కు ఆప్తుడిగాను గోపికి మంచి గుర్తింపు ఉందన్నారు. వారి కుటుంబాన్ని పరామ ర్శించేందుకు వెళ్లానని, హత్యకు కారణమైన కీలక టీడీపీ నాయకులు గ్రామంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారని వారు చెప్పారని, భార్యాభర్తల తగువుని హత్యకు మూలకారణంగా ప్రెస్‌మీట్లు పెట్టి పోలీసులు చెప్పడం సరికాదన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన రెండుమూడు నెలల్లోనే ఫరీదుపేటలో వైఎస్సార్ సీపీ కార్యకర్తను చంపారని, పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే మరో హత్య జరిగిందన్నారు.
వైఎస్సార్‌సీపీ నేతల ఆక్షేపణ
ఫరీదుపేట హత్య విచారణ తీరుపై విస్మయం వ్యక్తం చేసిన ధర్మాన కృష్ణదాస్
భార్యాభర్తల తగువు అని పోలీసులు అనడం రాజకీయమేనని వ్యాఖ్య
పోలీసు వ్యవస్థ కూడా రెడ్‌బుక్ ప్రకారమే నడుస్తోంది: మాజీ మంత్రి సీదిరి