
కుటుంబ కలహాలే నేపథ్యం..
సత్తారు గోపి హత్యపై ఎస్పీ వివరణ
శ్రీకాకుళం క్రైమ్ : ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త సత్తారు గోపి హత్య రెండు గ్రూపుల మధ్య జరిగిన హత్య కాదని, కేవలం భార్యాభర్తల తగాదాలో జరిగిన ఘటనగానే ప్రాథమిక విచారణలో భాగంగా భావిస్తున్నామని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటనపై ఆయన సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
ఇప్పటివరకు తాము చేసిన విచారణ, దొరికిన ఆధారాల ప్రకారం భార్యాభర్తల తగాదా పంచా యతీ చేయడానికి రెండువైపులా రెండు గ్రూపుల వారు ప్రయత్నించారని, అందులో భర్త తరఫు ఉన్న వ్యక్తి లోకల్ ఎంపీపీ మొదలవలస చిరంజీవి వద్ద పనిచేస్తున్నారని తెలిపారు. ఈ రెండు గ్రూ పుల మధ్య జరిగిన గొడవ వల్లే హత్య జరిగిందని పేర్కొన్నారు. ఈ రెండు గ్రూపుల మధ్య తగాదా లు ఉండొచ్చని, కానీ ఈ ఘటనకు ఆ తగాదాలు కారణం కాదని స్పష్టం చేశారు. కొన్ని పత్రికల్లో కొన్ని విధాలుగా రాస్తున్నారని, తాము చట్ట ప్రకారం పనిచేస్తున్నామని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఫరీదుపేట గ్రామంలో 1951 నుంచి డేటా తీస్తే 114 కేసులున్నాయని, హతుడిపై కూడా పది కేసు లు, ఓ రౌడీషీట్ ఉందని తెలిపారు. ప్రత్యక్ష సాక్షి చెప్పిన దానికి, పోలీసు ప్రకటనకు తేడా ఉందని ఓ విలేకరి ప్రశ్నించగా.. ఘటనకు పాల్పడిందని ఆ గ్రామానికి చెందిన వారేనని, ఘటన కూడా తగువులో ఉన్న మహిళ తల్లి ఇంటి వద్ద జరిగిందని, పంచాయితీ కోసం కాకపోతే అక్కడకు ఎందుకు వెళ్లారని తిరిగి ప్రశ్నించారు. ఘటనా స్థలంలో సీసీ కెమెరా కట్ చేశారని మరో పాత్రికేయుడు చెప్పగా.. సీపీ కెమెరా ఎందుకు పనిచేయలేదో పరిశీలిస్తామన్నారు. భార్యాభర్తల తగువులో 41ఏ నోటీసులు ఇవ్వడం సాధారణమని, పోలీసులు తమ డ్యూటీ తాము చేస్తారని మరో ప్రశ్నలకు బదులిస్తూ చెప్పారు.
భార్యాభర్తల తగువులో భర్త టార్గెట్ కదా.. అన్న ప్రశ్నకు ఎస్పీ స్పందిస్తూ రౌడీషీట్లు ఉన్న వారిని పెద్ద మనుషులంటూ పంచాయితీలు ఎలా చేస్తారని అన్నారు. చనిపోయిన వ్యక్తిపై రౌడీషీట్ ఉందని అన్నారు. గ్రామంపై తాము నిఘా పెట్ట డం వల్లే ఏడాదిగా ఎలాంటి ఘటన జరగలేదని చెప్పారు. ఎప్పటి నుంచో గ్రామాన్ని అతిసమస్యాత్మక గ్రామంగా చూస్తున్నామని, పీడీ యాక్టులు నమోదు చేస్తామని, అవసరమైతే కోర్టు అనుమతులు తీసుకుని తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొత్త ప్రభుత్వం వచ్చాక ఇలాంటి ఘటనలు జరగడం లేదని, ఎప్పటి నుంచో జరుగుతున్నాయని తెలిపారు.
గ్రూపుల మధ్య జరిగిన హత్య కాదు
భార్యాభర్తల తగాదాలో జరిగిన హత్యగానే భావిస్తున్నాం
ఫరీదుపేటలో వైఎస్సార్‌సీపీ నాయకుడి హత్య ఘటనపై వివరాలు వెల్లడించిన ఎస్పీ మహేశ్వర రెడ్డి
పత్రికల్లో వార్తలపై ఎస్పీ అసహనం