
భూమి దేవుడిది.. హక్కు నాయకుడిది
దేవుడి భూములను చదును చేసేందుకు ఎక్కడికక్కడ మట్టి వేసిన దృశ్యం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
జగన్నాథ స్వామి దేవుడి భూములపై టీడీపీ నేతల కన్ను పడింది. ఆక్రమించి, ప్లాట్ల విక్రయానికి పచ్చ ముఠా బరితెగించింది. ఎమ్మెల్యేకు కావల్సిన వ్యక్తులే కబ్జాకు దిగారు. ఆయన అండతోనా, సహకారంతోనా తెలీదు గానీ దాదాపు రూ.100కోట్ల విలువైన 10ఎకరాల భూమిని కాజేసేందుకు జోరుగా అడుగులు పడుతున్నాయి. మొత్తానికి జగన్నాథ స్వామి భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. కళ్ల ముందే కబ్జా కార్యక్రమాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీనిపై ఆమదాలవలస వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ సోమవారం జరిగిన గ్రీవెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌కు ఫిర్యాదు చేశారు. తక్షణమే జోక్యం చేసుకుని, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి కోట్లాది రూపాయల విలువైన భూమిని కాపాడాలని కోరారు.
మిగులు భూముల కబ్జా..
బొందిలీపురం జగన్నాథ స్వామి దేవస్థానానికి సంబంధించి ఆమదాలవలస మండలం తోటాడ రెవెన్యూ పరిధిలో గల సర్వే నంబర్ 121లో దాదాపు 199ఎకరాల భూములుండేవి. ఆ భూము ల్ని దశల వారీగా కొందరు ఆక్రమించి, వేరే ప్రాంతాలు, పక్క సర్వే నంబర్లతో తప్పుడు రిజిస్ట్రేషన్లు కూడా చేయించేసుకున్నారు. ఆ భూముల్లో భారీ భవనాల నిర్మాణాలు చేసేశారు. చాలావరకు భూములు అన్యాక్రాంతమైపోయాయి. మిగిలిన భూములను కాజేసేందుకు ప్రస్తుతం అడుగులు పడుతున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చాక కబ్జాదారులు జోరు పెంచారు. మనల్ని ఎవడ్రా అడిగేది అన్నట్టుగా దౌర్జన్యంగా ముందుకు సాగిపోతున్నారు. దాదాపు 10 ఎకరాల దేవస్థానం భూములను చదును చేసి, రోడ్లు వేస్తుండటమే కాకుండా విక్రయాలకు ఉపక్రమించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో తమకున్న లాలూచీ సిబ్బందితో రిజిస్ట్రేషన్లకు కూడా సిద్ధమవుతున్నారు.
ఎమ్మెల్యే అనుచరుల పన్నాగం..
ఎమ్మెల్యే అనుచరులుగా చెప్పుకునే ఆనందరావు, శ్యామలరావు, గణపతి, బాలరాజు, కృష్ణారావు, నారాయణరావు తదితర వ్యక్తులు కీలకంగా వ్యవహరిస్తూ, ఓ పూజారి సాయంతో కబ్జాకు దిగినట్టు తెలుస్తోంది. కీలక నేత అండ ఉండటంతో ఏ అధికారి అడ్డుకోరని పట్ట పగలు అక్కడ చదును చేయడమే కాకుండా రోడ్డు కూడా వేసేస్తున్నారు. ప్లాట్ల విభజన చేసి విక్రయాలకు ఉపక్రమించారు. దాదాపు 10 ఎకరాల ఆక్రమణకు ప్లాన్ చేశారు. దీని విలువ రూ.100కోట్ల వరకు ఉండవచ్చు. ఒక దెబ్బతో కోట్లు కొల్లగొట్ట వచ్చని భారీ భూకబ్జాకు దిగారు. తరుచూ ఆక్రమణలతో వివాదాస్పదమవుతున్న జగన్నాథ స్వామి దేవస్థానం భూములను ఇప్పుడైనా కాపాడుకోకపోతే మొత్తం కనుమరుగు అయ్యే పరిస్థితి నెలకొంది.
తోటాడ రెవెన్యూ పరిధిలో బరితెగించిన పచ్చముఠా
ఎమ్మెల్యే అండతో చెలరేగిపోతున్న అనుచరులు
జగన్నాథ స్వామి దేవస్థానం భూములు
కొట్టేసేందుకు అడుగులు
ఇప్పటికే చాలావరకు అన్యాక్రాంతమైన భూములు
ఆక్రమణలు అడ్డుకుని, దేవుడు భూములు కాపాడాలని గ్రీవెన్స్‌లో వైఎస్సార్‌సీపీ నేత చింతాడ రవికుమార్ ఫిర్యాదు
గ్రీవెన్స్‌లో ఫిర్యాదు..
తోటాడ రెవెన్యూ పరిధిలోని జగన్నాథ స్వామి దేవస్థానం భూములు ఆక్రమణ, అక్రమంగా రోడ్లు, ప్లాట్లు వేసి విక్రయాలకు సిద్ధమవుతుండటంపై వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ వెంటనే అప్రమత్తమయ్యారు. జరిగినదంతా లిఖితపూర్వకంగా గ్రీవెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌కు ఫిర్యాదు చేశారు. తక్షణమే విచారణ జరిపి, కబ్జాను అడ్డుకోవాలని, దేవుడు భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని కోరారు.

భూమి దేవుడిది.. హక్కు నాయకుడిది

భూమి దేవుడిది.. హక్కు నాయకుడిది