
గొంతు నొక్కి.. కత్తితో బెదిరించి
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని హయాతీనగర్ బాలాజీనగర్‌లో ఒక వృద్ధురాలి చెంపపై కొట్టి.. కత్తితో బెదిరించి.. మెడలో చైన్ దొంగిలించి పారిపోయిన యువకుడు జీరు సురేష్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి వివరాలు వెల్లడించారు. ఎచ్చెర్ల మండలంలోని కొయ్యం పంచాయతీ కొత్త కూరిమినాయుడుపేట గ్రామానికి చెందిన సురేష్ చెడు వ్యసనాలకు లోనై అప్పులు చేసిమరీ జల్సాలు చేసేవాడు. ఈ క్రమంలో ఈజీగా డబ్బులు సంపాదించాలంటే దొంగతనాలు చేయడమే మార్గమనుకున్నాడు.
నీళ్లు కావాలంటూ వెళ్లి..
ఈనెల 9వ తేదీ రాత్రి 8.30 గంటలకు బాలాజీనగర్‌లో వృద్ధురాలు పొడుగు ఆరుద్రమ్మ ఒక్కరే ఇంట్లో ఉండడం గమనించిన సురేష్ మంచినీళ్లు కావాలంటూ వెళ్లాడు. ఆమె నీరు తీసుకురావడానికి వెళ్తుంటే వెనుకగా వెళ్లడంతో వృద్ధురాలు ప్రశ్నించగా మీ అబ్బాయికి డబ్బులు అప్పిచ్చాను.. అంటూనే వృద్ధురాలి చెంపమీద గట్టిగా కొట్టాడు. అనంతరం మెడను నొక్కిపెట్టి కత్తిని పీకపై పెట్టి చంపుతానని బెదిరించాడు. మెడలో ఉన్న రెండు వరసల బంగారుతాడు బలవంతంగా తెంపి పారిపోయాడు. దీంతో వృద్ధురాలిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఒకటో పట్టణ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో సురేష్ నిందితుడని పోలీసులు కనిపెట్టి అరెస్టు చేశారు.
ఇదివరకూ కేసులున్నాయి
నిందితుడైన సురేష్ ఈనెల 13వ తేదీ సాయంత్రం 4 గంటలకు వెంకటాపురం సింహద్వారం వద్ద పోలీసులకు చిక్కడంతో ఇదివరకూ కేసులున్నట్లు విచారణలో తెలిసిందన్నారు. ఈ ఏడాది మే నెలలో పీఎన్‌కాలనీలో తన స్నేహితుడితో కలిసి ఎలక్ట్రికల్ సామాన్లు, టీవీ, ల్యాప్‌టాప్, బంగారు నగలు, రూ.50 వేలు నగదు దొంగిలించగా రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు అంపోలు జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చిన సురేష్ మళ్లీ చోరీకి పాల్పడటం విశేషం. నిందితుడి వద్ద కేసు ప్రాపర్టీని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. కేసును ఛేదించిన పోలీసులను అభినందించారు.
వృద్ధురాలి మెడలో చైన్ దొంగిలించిన యువకుడు అరెస్టు
వివరాలు వెల్లడించిన ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి