
అర్జీలు పునరావృతం కాకూడదు
శ్రీకాకుళం పాతబస్టాండ్: అర్జీలు పునరావృతం కాకుండా అధికారులు పరిష్కరించాలని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, డ్వామా, మహిళా శిశు సంక్షేమం, మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా పంచాయతీ, సాంఘిక సంక్షేమ శాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా విద్యాశాఖ, సర్వే అండ్ లాండ్ రికార్డులు, వ్యవసాయం, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ తదితర శాఖల సమస్యలపై 140 అర్జీలు స్వీకరించారు. అర్జీల స్వీకరణలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డీఆర్‌డీఏ పీడీ కిరణ్ కుమార్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
వినతులు పరిశీలిస్తే...
● డిగ్రీ అడ్మిషన్లు వెంటనే ప్రారంభించాలని, ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్ ద్వారా అడ్మిషన్లు చేపట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధులు డిమాండ్ చేశారు. డబుల్ మేజర్ విధానాన్ని తీసుకురావాలని, ఇంటర్న్‌షిప్ భారాన్ని తగ్గించాలని కోరారు. ప్రైవేటు కాలేజీలకు కొమ్ముకాస్తున్న ఆర్‌ఐవోపై చర్యలు తీసుకోవాలన్నారు.
● సమస్యలపై ఫిర్యాదు చేస్తే, అఽధికార పార్టీ అండతో తనపై దాడికి దిగారని సామాజిక కార్యకర్త నాయుడు గారి రాజశేఖర్ ఫిర్యాదు చేశారు. టీడీపీ కార్యకర్త, మరో ఆరుగురు కలిసి కరల్రతో హత్యాయత్నం చేశారన్నారు. అయితే అక్కడ కొంతమంది అడ్డుకోవడంతో ప్రమాదం తప్పిందని తెలిపారు. బీసీ హాస్టల్, ధర్మ సత్రంలపై తను గతంలో పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేయడం జరిగిందని, దానిపై ఎంకై ్వరీ అని పిలిచి దాడి చేశారన్నారు. బీసీ సంక్షేమ ఽఅఽధికారులు టీడీపీ కార్యకర్తలకు సమాచారం ఇచ్చి వారితో దాడి చేయించారని ఆరోపించారు. కరకట్టపై రూ.కోటి నిధులతో నిర్మించిన సీసీ రోడ్డులో ప్రమాణాలు పాటించలేదని ఫిర్యాదు చేసినందుకు బలరాం దాడి చేశాడని తెలిపారు. తనకు రక్షణ కల్పించాలని విన్నవించారు.
● గార మండలంలోని అంపోలు పరిధిలో బరాటం చెరువును సుమారుగా 10 ఎకరాల వరకు సానివాడ, ఆ చెరువు చుట్టు ఉన్న రైతులు ఆక్రమించుకున్నారని, వాటిని తొలగించాలని ఆ గ్రామానికి చెందిన రుప్ప లక్ష్మి కోరారు.
● దివ్యాంగులకు పింఛన్ ఇప్పించాలని పొందూరు మండలం గోకర్ణపల్లి గ్రామానికి చెందిన చౌదరి అసిరినాయుడు కోరారు. తనకు 59 శాతం వికలాంగత ధ్రువపత్రం ఉందని తెలిపారు. అలాగే నరసన్నపేటకు చెందిన సూర ప్రసాద్‌కి 60 శాతం వికలాంగత ఉందని, ఆయన కూడా పింఛను ఇప్పించాలని విన్నవించారు.
● గార మండలంలోని అంపోలు గ్రామానికి చెందిన కురమాన మల్లేశ్వరరావు తన భూమికి అడంగల్, పాస్‌బుక్ మంజూరు చేయాలని పలుమార్లు గ్రీవెన్సుకి వచ్చి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలి
ఆమదాలవలస మండలంలోని తోటాడ గ్రామ పంచాయతీ పరిధిలో 10 ఎకరాల బావాజీ మఠం భూముల ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని ఆమదాలవలస నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ కోరారు. ఈ మేరకు పీజీఆర్‌ఎస్‌లో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. అలాగే బొబ్బిలిపేట గ్రామంలో అధికార పార్టీ అండతో చెరువు గట్టు ఆక్రమణ జరిగిందని, వాటిని తక్షణమే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని విన్నవించారు. గాజులకొల్లివలస గ్రామంలో ప్రాథమిక పాఠశాలను ఎత్తివేయడంతో ఇబ్బందులు పడుతున్నారని, అక్కడ పాత పాఠశాలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా పొందూరు మండలంలోని గోకర్ణపల్లి గ్రామంలో గత సంవత్సర కాలంగా మంచానికే పరిమితమైన వ్యక్తికి వికలాంగ పింఛన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయనతో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్
మీ కోసంలో 140 అర్జీలు స్వీకరణ