
వంశధార కాలువకు మళ్లీ గండి
హిరమండలం: వంశధార ఎడమ ప్రధాన కాలువకు మరోసారి గండి పడింది. ఈ నెల 2న గొట్టా బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేశారు. అందులో భాగంగా ఎడమ ప్రధాన కాలువ నుంచి నీటిని విడుదల చేయగా.. రెండు రోజులకే మజ్జిగూడాం సమీపంలో గండి పడింది. దీంతో అప్పటికప్పుడు గేట్లు మూసి వేసి గండిని పూడ్చారు. అప్పటి నుంచి ఎడమ ప్రధాన కాలువలో సుమారు 1350 క్యూసెక్కుల నీరు ఎడమ ప్రధాన కాలువాలో ప్రవహిస్తోంది. అయితే మళ్లీ సోమవారం 5.02 కిలోమీటర్ 5ఏఆర్ ఓటీ స్లూయీజ్ (మదుము) వద్ద మరోసారి గండి పడింది. దీంతో కాలువలో నీరు పొలాల్లోకి చేరడంతో రైతులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు ఎడమ ప్రధాన కాలువలోకి నీటిని వెళ్లకుండా నిలిపివేశారు. నరసన్నపేట ఈఈ మురళీమోహన్, డీఈ శ్రీనివాసరావు, గొట్టాబ్యారేజీ డీఈ సరస్వతి గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించి గండిని పూడ్చివేశారు. అనంతరం కాలువలోకి 500 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. ఈ సందర్బంగా ఈఈ మురళీమోహన్ మాట్లాడుతూ కాలువలు నిర్మించి యాభై ఏళ్లు దాటాయని, రాతికట్టు కావడంతో రాయి మధ్యలో ఇసుక ఊడి గండిపడినట్లు తెలిపారు. నీరు విడిచిపెట్టిన 12 రోజులకే రెండుసార్లు గండిపడడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వానలు పడి కాస్త ఎక్కువ నీరు విడిచిపెడితే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. గతంలో నీటిని విడిచిపెట్టే సమయానికి కాలువలో జంగిల్ క్లియరెన్స్ పనులతో పాటు గట్టు పటిష్టం చేసేవారని, కానీ ఈ ఏడాది గట్టు పటిష్టం వంటి పనులు సరిగా జరిగినట్టు లేవని తెలిపారు.
ఆందోళనలో రైతులు