స్లాట్.. చాలా లేట్!
● టైమ్ స్లాట్ విధానంతో రిజిస్ట్రేషన్లకు తప్పని పాట్లు
● గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని భూ క్రయవిక్రయదారుల ఆవేదన
ఇచ్ఛాపురం టౌన్: రాష్ట్ర ప్రభుత్వం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో కొత్తగా తీసుకొచ్చిన టైమ్ స్లాట్ విధానంతో భూమి కొనుగోలు, అమ్మకందారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇచ్ఛాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చే భూక్రయ, విక్రయదారులు తాము నమోదుచేసుకున్న సమయానికంటే ముందుగానే చేరుకుని గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేయించాలంటే ముందుగానే స్లాట్ కోసం ఫీజు చెల్లించి సమయం నమోదు చేసుకోవాలని, ఆ సమయానికి తమలో ఎవరు లేకపోయినా, నెట్‌వర్క్ సరిగా పనిచేయకపోయినా, డాక్యుమెంట్ సరిగా లేకపోయినా, ఆలస్యం జరిగినా రిజిస్ట్రేషన్ జరగడం లేదని చెబుతున్నారు. స్లాట్ మొదటిసారి రిజిస్ట్రేషన్ ఉచితం అయినా పని జరగడంలేదని, రెండో సారి స్లాట్ నమోదుకు రూ.200 కాగా, మూడోసారి నమోదుకు రూ.800 ఫీజు చెల్లించాల్సి వస్తుందని తెలియజేస్తున్నారు. మధ్యాహ్న సమయంలో భోజన విరామం వల్ల కొంత సమయం పోతుందని, ఫలితంగా రోజుకు ముప్‌పై రిజిస్ట్రేషన్‌లు వరకు మాత్రమే జరుగుతున్నట్టు చెబుతున్నారు. గతంలోఇలా ఉండేదికాదని, ఎన్ని రిజిస్ట్రేషన్‌లైనా సాఫీగా జరిగిపోయేవని అంటున్నారు. ఇచ్ఛాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇచ్ఛాపురం మున్సిపాలిటీలోని 23 వార్డులు, ఇచ్ఛాపురం మండలంలోని 21 పంచాయతీలతోపాటు కవిటి మండలంలోని 23 పంచాయతీలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు జరుగుతుండటం వల్ల స్లాట్ నమోదు కష్టమవుతున్నట్టు డాక్యుమెంట్ రైటర్లు చెబుతున్నారు.
వివాహ రిజిస్ట్రేషన్లకు తప్పని పాట్లు
ప్రభుత్వం ఇటీవల కొత్త రేషన్‌కార్డుల కోసం సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించడంతో వివాహ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సైతం స్లాట్ విధానం తిప్పలు తప్పడంలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డుకు వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జత చేయాలని నిబంధన విధించడంతో రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద చిన్న పిల్లలతో కలిసి ఎండలోనే కూర్చుంటూ బారులు తీరుతున్నారు.
నిబంధనల మేరకే..
ప్రభుత్వ నిబందనల మేరకే భూ, వివాహ రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం. స్లాట్ విధానంలో ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. నిర్దేశిత సమయానికి సంబంధిత వ్యక్తి తప్పనిసరిగా హాజరుకావాల్సిందే.
– కె.తవిటినాయుడు,
సబ్ రిజిస్ట్రార్, ఇచ్ఛాపురం
స్లాట్.. చాలా లేట్!


