
మరణించిన 22 రోజులకు..
కాశీబుగ్గ: ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి ఊహించని రీతిలో మరణించిన యువకుడి మృతదేహం ఇరవై రెండు రోజుల అనంతరం స్వదేశానికి చేరుకుంది. పలాస మండలం తర్లాకోట పంచాయతీ ఖైజోల గ్రామానికి చెందిన బుడత దామోదర (33) గత నెల 21వ తేదీ సోమవారం మరణించినట్లు ఇక్కడకు సమాచారం వచ్చింది. పోలాండ్ దేశంలో వెల్డర్‌గా పనిచేసేందుకు వెళ్లి ఓ పార్కులో ఊయల వద్ద మరణించడం సంచలనంగా మారింది. దామోదర్‌కు అమ్మ పున్నమ్మ, పెరాలిసిస్‌తో బాధపడుతున్న తండ్రి లక్ష్మీనారాయణ, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దివ్యాంగుడైన అన్నయ్య, అతని భార్య పిల్లలతో కలిసి ఉమ్మడిగా జీవిస్తున్నారు. వారందరి కీ దామోదర్ మాత్రమే ఆధారం. కుటుంబం కోసమే ఆయన పోలాండ్ వెళ్లాడు. ఇంటి కోసం అంతదూరం వెళ్లి తిరిగి విగతజీవిగా రావ డంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఆయన చనిపోయిన ఘటనపై ‘సాక్షి’లో వార్త ప్రచురితమైంది. దీనికి అధికారులు స్పందించారు. అయితే అక్కడ నిబంధనల ప్రకారం ప్రక్రియలు అన్నీ పూర్తయ్యి మృతదేహం స్వగ్రామానికి చేరేందుకు 22 రోజులు పట్టింది.
ఆదివారం అంత్యక్రియలు
దామోదర్ మృతదేహానికి స్వగ్రామం ఖైజోల గ్రామంలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలాండ్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ చంద్రబాను, చంద్ర అల్లూరి, రమేష్‌లు కష్టపడగా ఇండియన్ ఎంబసీ ఎంతో సహకరించారని కుటుంబ సభ్యులు తెలిపారు.

మరణించిన 22 రోజులకు..