
చెరువు.. రక్షణ కరువు!
కొత్త కర్ర (తమ్మయ్య) చెరువులో..
బొడ్డవలస రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 44/2ఏలో 6.92 ఎకరాల విస్తీర్ణంలో కొత్తకర్ర చెరువు ఉంది. దీంట్లో కొందరు రైతులు గతంలోనే పొలాలుగా మార్చి ఆక్రమణలకు పాల్పడ్డారు. తాజాగా ప్రశాంతనగర్ వైపు నుంచి ఆక్రమణలు జోరందుకున్నాయి. ముందుగా వ్యర్థాలు చెరువులో వేసి ఆక్రమణలకు పాల్పడుతున్నారు. కొందరు చెరువు గర్భంలో కంచెలు పెట్టి చీరలు హద్దులుగా పెట్టడం గమనార్హం. ఆ స్థలంలో భవన నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరికొందరు ఇప్పటికే చెరువును ఆక్రమంచి ఇళ్ల నిర్మాణం చేపట్టారు.
నరసన్నపేట: కూటమి ప్రభుత్వం వచ్చాక చెరువులకు కూడా రక్షణ లేకుండాపోతోంది. నియోజకవర్గ కేంద్రం నరసన్నపేటలో చెరువు గర్భాల్లో యథేచ్చగా ఆక్రమణలు జరుగుతున్నా.. కట్టడి చేయాల్సిన అధికార యంత్రాంగం చోద్యం చూస్తోంది. అసలు రెవెన్యూ యంత్రాంగం ఉందా.. అనే సందేహం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. ఆక్రమణల గురించి పంచాయతీ సిబ్బందికి తెలిసినా రెవెన్యూ వాళ్లకి పట్టనిది తమకెందుకులే అని మిన్నకుండిపోతున్నారు.
నరసన్న చెరువులో..
ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న గొట్టిపల్లి రెవెన్యూలో 94/3లో 8.16 సెంట్ల విస్తీర్ణంతో నరసన్న చెరువు ఉంది. దీంట్లో ఆక్రమణలు అధ/కంగా జరుగుతున్నాయి. కాంప్లెక్స్ నుంచి జాతీయ రహదారికి వెళ్లేదారిలో చెరువు భాగం మొత్తం కప్పేస్తున్నారు. తాజాగా ఆటో స్టాండ్ పేరిట చెరువును కప్పేశారు. ఇక్కడ ఆటో స్టాండ్‌కు అనుమతులు లేకపోయినా చెరువు కప్పి షెడ్ వేశారు. దానికి ముందు, వెనుక భాగాల్లో చెరువు గర్భాన్ని కప్పేశారు. ఇండోర్ స్టేడియానికి కేటాయించిన స్థలంలో కూడా పట్టణంలో శిథిల భవన వ్యర్థాలు వేసి ఆక్రమణలు సాగిస్తున్నారు. మరోవైపు ఇదే చెరువు గర్భంలో పచూరీ కాలనీకి ఆనుకొని ఉన్నవారు ఆక్రమణలకు పాల్పడుతున్నారు. కోట్ల విలువైన చెరువు అన్యాక్రాంతమవుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు.
తగ్గుతున్న భూగర్భజలాలు..
నరసన్నపేట పట్టణానికి చుట్టుపక్కల చెరువులు ఉండటం వల్ల భూగర్భ జలాలకు ఇబ్బంది ఉండేవి కాదు. ఇప్పుడు చెరువులన్నీ ఆక్రమణలకు గురవుతుండటం, భనవాలు నిర్మాణం కావడంతో చెరువుల్లో నీరు నిల్వకు అవకాశం లేకుండాపోతోంది. ఫలితంగా ఏటా భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మరింతగా భూగర్భ జలాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆక్రమణలు అడ్డుకోవాలి..
చెరువులు కప్పవద్దని స్టాండింగ్ జీఓ ఉంది. దీనిని రెవెన్యూ యంత్రాంగం విధిగా అమలు చేయాలి. సుప్రీం కోర్టు ఆర్డర్ కూడా ఉంది. ఇవేవీ నరసన్నపేటలో చెరువుల ఆక్రమణలకు అడ్డుకోవడం లేదు. కేవలం రెవెన్యూ యంత్రాంగం అసమర్థత, నిర్లక్ష్యం వల్లే చెరువులు కనుమరుగవుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలి.
– ఎస్.ప్రభాకరరావు, విశ్రాంత తహసీల్దార్, మారుతీనగర్, నరసన్నపేట
నరసన్నపేటలో యథేచ్చగా ఆక్రమణలు
నరసన్న, కొత్తకర్ర చెరువుల్లో అక్రమ కట్టడాలు
పట్టించుకోని రెవెన్యూ యంత్రాంగం
చర్యలు తీసుకుంటాం..
నరసన్న చెరువు, కొత్తకర్ర చెరువుల్లో ఆక్రమణలను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం. వీఆర్వోలను పంపి ఆక్రమణల గురించి వివరాలు తెలుసుకుంటాం. చెరువుల్లో ఆక్రమణలకు పాల్పడటం సరికాదు.
– టి.సత్యనారాయణ,
తహసీల్దార్, నరసన్నపేట

చెరువు.. రక్షణ కరువు!

చెరువు.. రక్షణ కరువు!

చెరువు.. రక్షణ కరువు!