
లారీ డ్రైవర్లపై దాడి
నందిగాం: మండలంలోని పెద్దతామరాపల్లి జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి అలజడి నెలకొంది. లారీలు ఆపి నిద్రిస్తున్న డ్రైవర్లుపై కొంతమంది దాడి చేసి అలజడి సృష్టించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన సుజిత్‌కుమార్‌రాయ్, అమర్‌జీత్ చౌహాన్, పురుషోత్తంసింగ్, విజయ్‌కుమార్ యాదవ్‌లు చైన్నె నుంచి కోలకత్తా మార్గంలో వెళ్తూ ఆదివారం రాత్రి 9 గంటలకు నందిగాం మండలం పెద్దతామరాపల్లి వద్ద ఉన్న డాబా వద్ద ఆగారు. లారీలను సర్వీస్ రోడ్డువైపు పార్కింగ్ చేసి భోజనాలు అనంతరం తమ లారీల్లో నిద్రపోయారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఐదుగురు వ్యక్తులు మొదటగా విజయ్‌కుమార్ యాదవ్‌ను లేపి కత్తి చూపించి బెదిరించారు. సకాలంలో అప్రమత్తమైన విజయ్‌కుమార్ ఒక్కసారిగా లారీ స్టార్ట్ చేసి వెళ్లిపోయాడు. తర్వాత సుజిత్‌కుమార్ రాయ్, అమర్‌జీత్ చౌహాన్, పురుషోత్తం సింగ్‌లను లేపి రాళ్లతో లారీ అద్దాలు పగులగొట్టి దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా కొట్టి కత్తితో బెదిరించి వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లు, రూ.28వేలు నగదు లాక్కొని తామరాపల్లి వైపు పొలాల గుండా వెళ్లిపోయారు. అనంతరం డ్రైవర్లు కేకలు వేయడంతో డాబా సిబ్బంది వచ్చి గాయాల పాలైన వారిని టెక్కలి ఆసుపత్రికి తరలించారు. దాడి లో పాల్గోన్న వారంతా తెలుగు, హిందీ మాట్లాడుతున్నారని, అందరూ 30 ఏళ్లలోపు వారేనని బాధితులు చెబుతున్నారు. అనంతరం నందిగాం పోలీసులకు సమాచారం అందించారు.
నగదు, సెల్‌ఫోన్లతో పరారైన దుండగులు
పెద్ద తామరాపల్లిలో అర్ధరాత్రి అలజడి
వాహనదారుడినీ వదల్లేదు..
నందిగాం: సుభద్రాపురం సమీపంలో ఆదివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో బైక్‌పై వస్తున్న ఓ వ్యక్తి మూత్ర విసర్జన కోసం బైక్ ఆపి ఉండగా కొంతమంది దాడి చేశారు. తన వద్ద ఉన్న డబ్బులు తీసుకొని వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
పెట్రోల్ అపహరణ..
నందిగాం మండలంలోని సుభద్రాపురం పరిధి గుండా వెళ్తున్న ఐఓసీఎల్ పైపులైన్ నుంచి కొంత మంది పెట్రోల్ దొంగతనం చేసిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. పైపులైన్‌కు ఉండే ఓపెన్‌లో చిన్న పాటి మోటార్ ఇంజన్ పెట్టి పెట్రోల్ తోడేసినట్లు తెలుస్తోంది. దీనిపై నందిగాం పోలీసులకు ఫిర్యాదు అందగా హెచ్‌సీ రమణ కేసు నమోదు చేశారు. గతంలో కాశీరాజుకాశీపురం వద్ద ఇలాగే పెట్రోల్ చోరీ జరిగినట్లు సమాచారం. ప్రశాంతంగా ఉండే నందిగాం మండలంలో కూటమి ప్రభుత్వం వచ్చాక శాంతిభద్రతలు ఘోరంగా వైఫల్యం చెందాయని, లా అండ్ ఆర్డర్, పోలీస్ వ్యవస్థ తీరుకు తాజా ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయని పలువురు విమర్శిస్తున్నారు.

లారీ డ్రైవర్లపై దాడి

లారీ డ్రైవర్లపై దాడి