
పిడుగు.. అప్రమత్తతే గొడుగు!
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ప్రస్తుతం మండుతున్న ఎండలకు భూమి వేడెక్కిపోవడంతో ఉక్కపోత ఎక్కువవుతోంది. ఈ క్రమంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు సైతం పడుతుండటంతో మరణాలు సంభవిస్తున్నాయి. ఎక్కువగా పొలం పనికి వెళ్లే రైతులు, గొర్రెలు, మేకలు, పశువులకాపర్లు పిడుగుపాటుకి గురై మరణిస్తుంటారు. పిడుగులనుంచి రక్షణ పొందాలంటే జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
ఈ జాగ్రత్తలు
తప్పనిసరి..
● ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతున్నప్పుడు ఇంట్లోనే ఉండటం మేలు.
● సముద్రం, కొలనులు, సరస్సులు, చెరువుల దగ్గర ఉంటే వెంటనే దూరంగా వెళ్లాలి. రేకు, లోహం కలిగిన నిర్మాణాలకు దూరంగా ఉండాలి.
● ఉరుముల శబ్ధం వినగానే పొలాల్లో పనిచేసే రైతులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు, పశువుల కాపరులు, గొర్రెల కాపరులు వెంటనే సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలి.
● కారు/బస్సు లోపల ఉంటే అన్ని డోర్స్ మూసి ఉంచాలి. ● చర్మం జలదరింపు ఉంటే మెరుపు, పిడుగు రావడానికి సూచనగా భావించాలి. సురక్షిత ప్రాంతాలకు వెళ్లే అవకాశం లేకుంటే రబ్బరు చెప్పులు ధరించి చెవులు మూసుకుని తలను నేలకు తగలకుండా మోకాలిపై కూర్చోవాలి.
● పిడుగు బాధితులను తాకవచ్చు. సత్వరమే వారికి సహాయం అందించాలి. బాధితులను సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించాలి.
అందని సాయం..
పిడుగు పాటుకి గురై వ్యక్తులు మరణించినా కార్మికశాఖ, పశుసంవర్ధకశాఖ నుంచి ఎటువంటి ఎక్స్‌గ్రేసియా ఇవ్వడం లేదు. మరణించిన వ్యక్తికి ఏదైనా ఇన్సురెన్స్ పాలసీ ఉంటే తప్ప ఆ వ్యక్తి కుటుంబానికి ఎటువంటి పరిహారం అందించడం లేదు. ఈ మరణాలను ప్రత్యేక కేసులుగా భావించి ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
సకాలంలో వైద్యం అందాలి..
పిడుగు పడే వ్యక్తులకు (ఏబీసీ) తప్పనిసరిగా ఉండాలి. ఏ–ఎయిర్‌వే, బి–బ్లడ్ సర్క్యులేషన్, సి–కార్డియాక్ ఫంక్షన్ ఎలా ఉందో తెలుసుకోవాలి. సీపీఆర్ చేసి దగ్గరలో ఉండే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించాలి. పిడుగు పడిన వ్యక్తి గుండె కొట్టుకునే శాతం పెరిగిపోయి మరణించే ప్రమాదం ఉంటుంది. ఎముకలు, మజిల్ ప్రోటిన్ అంతా కరిగిపోతాయి. పిడుగు ధాటికి వెలువడే కరెంట్ మెదడుకు చేరితో ఫిట్స్ వంటివి వచ్చి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదముంది.
– డాక్టర్ సనపల నర్సింగరావు,
జనరల్ ఫిజీషియన్, శ్రీకాకుళం
ఇవి చేయవద్దు..
ఉరుములు, మెరుపులు సంభవించినపుడు చెట్ల కింద, టవర్లు, చెరువులు దగ్గర ఉండరాదు.
ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర పరికరాలు చార్జ్‌డ్ ఫోన్లు/ మొబైల్స్ వినియోగించరాదు. పిడుగుల సమయంలో స్నానం చేయడం, చేతులు కడగటం, నీటిలో ఉండడం లాంటివి చేయరాదు.
మోటారు సైకిళ్లు, ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు వేలాడుతున్న విద్యుత్ తీగలకు, విద్యుత్ స్తంభాలకు, ఇతర ఇనుప వస్తువులకు దూరంగా ఉండాలి.
వాహనంలో ఉండే లోహపు భాగాలను తాకరాదు.
అకాల వర్షాల్లో ఉరుములు, మెరుపులతో పిడుగుపాట్లు
అప్రమత్తం లేకుంటే ప్రాణాలకే ప్రమాదం
మృత్యువాత పడుతున్న రైతులు, పశుపెంపకందారులు

పిడుగు.. అప్రమత్తతే గొడుగు!