పోర్టు నిర్మాణంపై విషం కక్కిన ‘ఈనాడు’ | Sakshi
Sakshi News home page

పోర్టు నిర్మాణంపై విషం కక్కిన ‘ఈనాడు’

Published Wed, Sep 6 2023 2:44 AM

- - Sakshi

టెక్కలి: టీడీపీ హయాంలో జరగని పని వైఎస్సార్‌ సీపీ హయాంలో జరుగుతోందనే బాధ.. శంకుస్థాపన నుంచి పనులు వేగంగా జరుగుతున్నాయనే కక్ష.. పరిహారాల నుంచి నిర్మాణాల వరకు ప్రభుత్వం చూపిస్తున్న చొరవపై ఓర్వలేని తనంతో.. మూలపేట పోర్టు నిర్మాణంపై ‘ఈనాడు’ ఓ కథనాన్ని మంగళవారం అచ్చేసింది. ‘నమ్మించి నట్టేట ముంచారు’ అన్న శీర్షికన అబద్ధాల వార్తను ప్రచురించింది. ఈ కథనాన్ని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లాఠకర్‌ తీవ్రంగా ఖండించారు. దీనిపై పూర్తిస్థాయిలో వాస్తవాలను వెల్లడిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. అధికారులను సంప్రదించకుండా, సరైన సమాచారం లేకుండా ఇలాంటి కథనాలను ప్రచురిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లో ఒక్కో జీడి, మామిడి చెట్టుకు, రూ.5 వేల చొప్పున పరిహారమిస్తామని చెప్పి రూ.2,500 పరిహారం ఇచ్చారని, కొందరికే ఇచ్చారని ‘ఈనాడు’ కథనంలో పేర్కొన్నారు. కానీ ఈ ఏడాది మూడు సార్లు నిర్వాసితులతో జరిపిన సమావేశాల్లో ప్రభుత్వ భూముల్లో చెట్లకు ఎలాంటి నష్టపరిహారం ఉండదని, జిరాయితీ భూముల్లో మాత్రమే చెల్లిస్తామని స్పష్టంగా చెప్పామని కలెక్టర్‌ తెలిపారు.

కటాఫ్‌ తేదీ నాటికి, 18 ఏళ్లకు ఒకటి, రెండు నెలలు తక్కువ వయసున్నా, వారిని నిర్వాసిత కుటుంబంగా గుర్తించి ప్యాకేజీ ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, స్థానిక యువతకు ఉద్యోగాల ఊసే లేదని ఈనాడు ప్రచురించింది. అయితే భూసేకరణ, పునరావాస చట్టం ప్రకారం 18 ఏళ్ల వయసు నిండని వారికి పరిహారం ఇవ్వబోమని ముందే చెప్పామని కలెక్టర్‌ స్పష్టం చేశారు. 18 ఏళ్ల వయసున్న వారందరికీ నిర్వాసిత ప్యాకేజీ అందించామని, పోర్టు నిర్మాణం చేస్తున్న విశ్వ సముద్ర కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి మూలపేట,విష్ణు చక్రం గ్రామాల్లో గల యువత నైపుణ్య తర్ఫీదు కోసం ఒక నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరామని, ఈ గ్రామాలకు చెందిన 25 మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని తెలిపారు.

తాత్కాలిక వలసదారులను నిర్వాసితులుగా గుర్తించలేదని కథనంలో ప్రచురించారు. అయితే వీరి జాబితాను సమర్పించాలని టెక్కలి ఆర్డీఓను ఇదివరకే ఆదేశించామని, నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

నిర్వాసితులకు ప్రభుత్వమే ఇల్లు నిర్మిస్తుందని హామీ ఇచ్చి ఇప్పుడు ఇచ్చిన ప్యాకేజీ నుంచి ఇంటి నిర్మాణానికి రూ.3.50 లక్షలు భరించాలని చెబుతున్నట్లు కథనంలో వివరించారు. అయితే ఇంటి నిర్మాణ ఖర్చు రూ.3.55 లక్షలుగా ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసిందని, దీనిపై గ్రామస్తులు సంతకాలు కూడా చేశారని తెలిపారు. నిర్వాసితుల కోసం కస్పానౌపడ గ్రామంలో సుమారు 55 ఎకరాల విస్తీర్ణంలో నిర్వాసిత కాలనీ నిర్మిస్తున్నామని వివరించారు.

పోర్టు నిర్మిత గ్రామాల ప్రభుత్వ ఉద్యోగులకూ, నిర్వాసితుల తరహాలో ప్యాకేజీ అమలు చేస్తామ ని హామీ ఇచ్చి, పోర్టు నిర్మిత గ్రామాల్లో ఉన్న ఆర్మీ జవాన్లు, ఉపాధ్యాయులు ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న దాదాపు 20 మంది ప్రభుత్వ ఉద్యోగులకు రూ.9.90 లక్షలకి బదులుగా రూ.4.41 లక్షలే చెల్లించినట్టు కథనం ప్రచురించారు. అయితే భూసేకరణ, పునరావాస చట్టం ప్రకారం ఉద్యోగుల వార్షిక భత్యం, ఉద్యోగం ఎంపిక కింద రూ.5,50,000 మినహాయించడం వల్ల మొత్తం ప్యాకేజీ సొమ్ములో నుంచి రూ.4.40లక్షలు ఉద్యోగులకి పరిహారం ఇచ్చామన్నారు. దీనిపై నిబంధనలు తెలుసుకోవాలని హితవు పలికారు.

Advertisement
Advertisement