తప్పుడు పత్రాలతో స్థల విక్రయం | - | Sakshi
Sakshi News home page

తప్పుడు పత్రాలతో స్థల విక్రయం

Oct 11 2026 1:16 PM | Updated on Oct 11 2026 1:16 PM

● రూ.25 లక్షలు తీసుకుని మోసగించిన వైనం

● పోలీస్‌ స్టేషన్‌లో బాధిత మహిళ ఫిర్యాదు

● ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు

కదిరి టౌన్‌: తప్పుడు పత్రాలతో తనకు స్థలం విక్రయించి రూ.25 లక్షలు మోసం చేశారని మున్సిపల్‌ పరిధిలోని అమీర్‌నగర్‌కు చెందిన షబియాబేగం శనివారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తాను సైదాపురం పొలం సర్వే నంబర్‌ 240–2లో 5.78 ఎకరాల్లో 233 చదరపు గజాలు (ఆరు సెంట్లు) స్థలాన్ని బీసీ హాస్టల్‌ వార్డెన్‌ లక్ష్మీనారాయణ ద్వారా పులివెందులకు చెందిన మహబూబ్‌బాషా నుంచి రూ.25 లక్షలకు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకుంది. ఇటీవల ఆ స్థలానికి కంచె వేసుకునేందుకు వెళ్లగా.. శంకర్‌రెడ్డి అనే వ్యక్తి అడ్డు తెలిపాడు. సదరు స్థలం తనదని చెప్పడంతోపాటు ఆ స్థలానికి సంబంధించిన అసలైన పత్రాలు చూపారు. దీంతో తాను మోసపోయాయని తెలుసుకున్న షబియాబేగం తనకు భూమి విక్రయించిన మహబూబ్‌బాషాతో పాటు మధ్యవర్తిగా వ్యవహరించిన హాస్టల్‌ వార్డెన్‌ లక్ష్మీనారాయణపై పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పట్టణ సీఐ బి.వెంకటేశ్వర్లు మహబూబ్‌బాషా, లక్ష్మీనారాయణపై చీటింగ్‌ కేసు నమోదు చేశారు.

సమన్వయంతో

ఎన్నికలు నిర్వహిద్దాం

అనంతపురం న్యూ టౌన్‌: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జెడ్పీ డిప్యూటీ సీఈఓ మల్లికార్జున సూచించారు. అనంతపురం జిల్లాపరిషత్‌ ప్రాంగణంలోని డీపీఆర్‌సీ కేంద్రంలో శనివారం శ్రీసత్యసాయి జిల్లా ఎంపీడీఓలతో సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, రిజర్వేషన్ల ప్రక్రియ, పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని ఎంపీడీఓలను ఆదేశించారు. సమావేశంలో జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వెంకటరత్నం, డీడీఓ శ్రీనివాసులు, రామాంజనేయులు, నరేంద్ర, ఎంపీడీఓలు పాల్గొన్నారు.

నేటి నుంచి ఇన్‌ సర్వీస్‌

టీచర్లకు ‘టెట్‌’ పరీక్షలు

పుట్టపర్తి: ఇన్‌సర్వీస్‌ టీచర్లకు ఆదివారం నుంచి టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ కిష్టప్ప ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ పేపర్లకు సంబంధించి మొత్తం 327 మంది పరీక్షకు హాజరవుతున్నట్లు వెల్లడించారు. వీరి కోసం పుట్టపర్తి సమీపంలోని సంస్కృతి స్కూల్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, బెంగళూరులోని అయాన్‌ డిజిటల్‌ జోన్‌ కళాశాలల్లో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రోజూ రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి విడత, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో విడత పరీక్షలు జరగనున్నాయి. 11వ తేదీన సంస్కృతి కళాశాలలో తొలివిడతలో వంద మంది, రెండో విడతలో వంద మంది పరీక్ష రాస్తారన్నారు. 11వ తేదీ రెండో విడతలో బెంగళూరులోని అయాన్‌ డిజిటల్‌ జోన్‌లో 34 మంది, 12వ తేదీ రెండో విడతలో 13 మంది, 14వ తేదీ తొలి విడతలో 49 మంది, అదే రోజు రెండో విడతలో 31 మందికి పరీక్ష ఉంటుందని వెల్లడించారు. ఈ మేరకు ఆయా కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు డీఈఓ వెల్లడించారు. సెల్‌ఫోన్లతో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని, అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు గుర్తింపు కార్డు తీసుకురావాలని, పరీక్ష ప్రారంభానికి గంటన్నర ముందే కేంద్రానికి చేరుకోవాలని డీఈఓ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement