లేపాక్షి: ప్రముఖ శైవ క్షేత్రమైన లేపాక్షి దుర్గా పాపనాశేశ్వర వీరభద్రస్వామి ఆలయంలో ఆదివారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకూ శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్య నిర్వాహక అధికారి నరసింహమూర్తి తెలిపారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారు రోజుకో అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారన్నారు. 11వ తేదీన బాలాత్రిపుర సుందరి, 12న గాయత్రీ దేవి, 13న అన్నపూర్ణేశ్వరి, 14న కాత్యాయని దేవి, 15న మహాలక్ష్మి, 16న సరస్వతీ దేవి, 17న లలితాదేవి, 18న దుర్గాదేవి, 19న మహిసాసుర మర్దిని, 20న రాజరాజేశ్వరీదేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారన్నారు. ఉత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు.
జెడ్పీ సీఈఓగా వెంకటసుబ్బయ్య
పుట్టపర్తి అర్బన్: జిల్లాలో నూతనంగా ఏర్పాటైన జిల్లా పరిషత్‌కు సీఈఓగా జి. వెంకట సుబ్బయ్యను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటి వరకూ జిల్లాలో డీపీఓగా పని చేసిన సమతను అనంతపురం జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
బాచన్నపల్లిలో ప్రాచీన
వీరగల్లు శాసనం లభ్యం
గోరంట్ల: మండల పరిధిలోని బాచన్నపల్లి గ్రామంలో 10వ శతాబ్దం నాటి అరుదైన వీరగల్లు శిలాశాసనం వెలుగు చూసినట్టు చరిత్రకారుడు మైనాస్వామి తెలిపారు. శనివారం ఆయన గ్రామంలో పర్యటించి క్షేత్రస్థాయి పరిశోధనలు చేశారు. ఈ క్రమంలోనే వీరగల్లు శిలాఫలకాన్ని గుర్తించి అందులోని ప్రాచీన లిపి, శిల్ప విశేషాలను పరిశీలించారు. గ్రామానికి తూర్పున ఉన్న శిథిల శివాలయం పక్కనే వీరగల్లు శాసనాన్ని గుర్తించినట్టు వెల్లడించారు. శాసన శిలలోని శిల్పరూపురేఖలను బట్టి నోలంబ పల్లవుల కాలానికి చెందిన వీరుడుగా భావిస్తున్నట్లు తెలిపారు. వీరశిల మధ్య భాగంలో విల్లంబులు ధరించిన పరాక్రమవంతుడైన ధనుర్దారి శిల్పం చెక్కబడి ఉందన్నారు. వీరుడు ఎడమచేతిలో ఎత్తైన ధనుస్సును పట్టుకొని కుడిచేతిలో బాణం సంధిస్తూ శత్రువులపైకి దూసుకెళ్తున్న యుద్ధ భంగిమలో కనిపిస్తున్నారని, తలపై ఎత్తైన కొప్పు, నడుముకు చుట్టిన కచ్చ, బాకు నాటి యోధుల సమర వేషధారణను ప్రతిబింబిస్తున్నాయన్నారు. నోలంబవాడి సరిహద్దుల్లో గ్రామంపై శత్రుసేనలు, దోపిడీ ముఠాలు దాడి చేసినప్పుడు గ్రామాన్ని కాపాడటానికి పోరాడి వీరమరణం పొందినట్టుగా అర్థం అవుతోందన్నారు. నోలంబ పల్లవుల రాజధాని హెంజేరు కాగా... నేటి హేమావతి పరిసరాల్లో మినహా ఈ ప్రాంతంలో నోలంబ వీరగల్లులు కనిపించడం అరుదైన విషయమన్నారు. సుమారు 1,400 ఏళ్ల చరిత్ర ఉన్న బాచన్నపల్లిని పరిశోధకులు, అధ్యయనకారులు, భారత సర్వేక్షణ నిపుణులు సందర్శించాలని మైనాస్వామి విజ్ఞప్తి చేశారు.


