హిందూపురం టౌన్: ప్రసవం కోసం వచ్చిన ఓ గర్భిణిని వైద్యులు తమ నిర్లక్ష్యంతో కాటికి పంపారు. బాధిత కుటుంబ సభ్యుల వివరాలమేరకు... పరిగి మండలం బీచగానిపల్లికి చెందిన నాగేంద్ర, రమ్యశ్రీ దంపతులు. సోమవారం మధ్యాహ్నం రమ్యశ్రీకి పురిటి నొప్పులు రావడంతో ఆశా వర్కర్‌తో కలిసి హిందూపురం పట్టణానికి వచ్చారు. జిల్లా ప్రభుత్వాస్పత్రిలో గైనకాలజిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ బాబు బుడెన్ ప్రైవేటు క్లినిక్‌లో ఉండడంతో ప్రైవేటు ఆస్పత్రి అయిన ‘మాతృవందన ఆస్పత్రి’ వద్దకు ఆశా కార్యకర్త వారిని తీసుకెళ్లింది. అక్కడ పరీక్షించిన ౖవైద్యుడు బాబు బుడెన్.. సిజేరియన్ చేయాలని చెప్పాడు. పండంటి మగ బిడ్డకు ఆమె జన్మనించింది. కొద్ది సేపటికి బాలింత సృహకోల్పోవడంతో అక్కడి వైద్యులు రెఫర్ చేయగా, ప్రైవేటు ఆస్పత్రి నుంచి అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అయితే అక్కడ పరీక్షించిన వైద్యులు బాలింత మృతి చెందినట్లు నిర్దారించారు. దీంతో బాధితురాలు బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రైవేటు ఆస్పత్రిలోని డాక్టర్ నిర్లక్ష్యంతోనే బాలింత మృతి చెందిందని, ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని బాధితుల మాట్లాడారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకులు, డాక్టర్‌తో పాటు సిబ్బందిపై కేసు నమోదు చేశారు. మంగళవారం ప్రభుత్వ ఆస్పత్రితో బాలింతకు పోస్టుమార్టం నిర్వహించారు.
ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యుల నిర్వాకం
మాతృ వందన ఆస్పత్రి సీజ్
బాలింత మృతి విషయాన్ని తెలుసుకున్న డీఎంహెచ్‌ఓ ఫైరోజా బేగం మంగళవారం మాతృవందన ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని లేబర్ రూమ్ నిబంధనలకు విరుద్ధంగా ఉండడం, ఆపరేషన్ థియేటర్ కలిపి ఉండటం వలన లేబర్ రూమ్, ఓటీలను సీజ్ చేశారు. ఆస్పత్రి నిర్వాహకులకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ బాలింత మృతిపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామన్నారు. ఆస్పత్రిలో రోగులు ఉన్నందున ఆస్పత్రిని పూర్తిగా సీజ్ చేయడం లేదని, నిబంధనల మేరకు మూడు రోజుల లోపల షోకాజ్ నోటీసుకు వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చామన్నారు.


