● రోగులతో మాట్లాడి సేవలపై ఆరా తీసిన ఎన్‌క్యూఏఎస్ బృందం సభ్యులు
ఎన్‌పీ కుంట: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవల నాణ్యత, పారిశుధ్యం, సౌకర్యాలను మెరుగుపరిచేందుకు తనిఖీలు నిర్వహించే నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ బృందం (ఎన్‌క్యూఏఎస్) సభ్యులు సోమవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. అసిస్టెంట్ ప్రోగ్రాం అధికారి కమలాకర్, డాక్టర్ సత్యనారాయణస్వామి తదితరులతో కూడిన బృందం సభ్యులు ఆస్పత్రిలోని అన్ని విభాగాలను సందర్శించారు. ఓపీ, ఐపీ సేవలను ఆరా తీశారు. అలాగే ప్రసూతి గది, ల్యాబ్, ఔషధ నిల్వలు, రికార్డుల గది, పారిశుధ్యం నిర్వహణ, తాగునీటి సౌకర్యం, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలపై క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో పాటించవలసిన నాణ్యత ప్రమాణాలు, రికార్డుల నిర్వహణ, తదితర సేవల మెరుగుదలకు సిబ్బందికి పలు సూచనలు చేశారు. వారి వెంట వైద్యులు ఎంఎస్ దీప్తి, బాలాజీ నాయక్, సీహెచ్‌ఓ నాగలక్ష్మి ఉన్నారు.


