ప్రశాంతినిలయం: ఇటీవల విజయవాడ వేదికగా తమ డిమాండ్లు పరిష్కరించాలని 45 రోజుల గడువు విధించినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని వైద్యారోగ్య శాఖలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం రెవెన్యూ భవన్‌లో జరిగిన పీజీఆర్‌ఎస్‌లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ డిమాండ్ల పరిష్కారానికి జూన్ 17న ధర్నా నిర్వహించి 45 రోజుల గడువు ఇచ్చామని అయినా ఇప్పటి వరకూ ప్రభుత్వం డిమాండ్లు పరిష్కరించక పోగా కనీసం చర్చలకు కూడా పిలవలేదన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, రెగ్యులరైజేషన్ పూర్తయ్యే వరకూ 100 శాతం గ్రాస్ వేతనం ఇవ్వాలన్నారు. మరణించిన ఉద్యోగికి సంబంధించి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిబ్బంది జ్యోతి, క్షమత, సుమ, శివమ్మ, చరణ్, రాకుమార్, చంద్రకళ ఉన్నారు.
కిడ్నాప్ కేసులో
నిందితుడి అరెస్టు
తనకల్లు: కిడ్నాప్ కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ దిలీప్‌కుమార్ తెలిపారు. వివరాలు... చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం జెట్టిపల్లికి చెందిన గల్లా హేమచంద్ర మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి 2019లో గందోడివారిపల్లికి చెందిన నరేష్, నైనాను కిడ్నాప్ చేసి రూ. 3 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు అప్పట్లోనే ఇద్దరిని అరెస్టు చేశారు. గల్లా హేమచంద్ర పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఇటీవల గల్లా హేమచంద్ర చిత్తూరు–తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న ఎస్‌ఐ తన సిబ్బందిని పంపి అతన్ని అరెస్టు చేశారు. సోమవారం కదిరి కోర్టులో హాజరుపరచగా నిందితుడికి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు.
కర్ణాటక మద్యం ధ్వంసం
రామగిరి: రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన రూ. 3.47 లక్షల విలువైన కర్ణాటక మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. నిబంధనల ప్రకారం ధ్వంసం చేసినట్లు ఎస్‌ఐ ప్రదీప్ రాజ్ తెలిపారు. 8,213 లిక్కర్ ప్యాకెట్లు, 789 లీటర్ల వివిధ మద్యం బాటిళ్లతో పాటు బీర్ బాటిళ్లు ధ్వంసం చేశామన్నారు. కార్యక్రమంలో డీపీ అండ్‌ఈఓ గోవిందనాయక్, ఎకై ్సజ్ సీఐ ఫరూక్ అజం, ఎస్‌ఐ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నీరు కరువై.. జీవాలతో వలస
గాండ్లపెంట: తీవ్ర వర్షాభావంతో నీరు కరువవడంతో కాపర్లు జీవాలతో కలిసి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఎన్‌పీ కుంట మండలం పుల్లగూర్లపల్లికి చెందిన గంగయ్యకు 50 ఆవులు ఉన్నాయి. ఇటీవల జీవాలకు పశుగ్రాసంతో పాటు తాగునీరు కరువైంది. కదిరి రూరల్ మండలంలోని విఠలరాయుని చెరువులో కొద్దిపాటి నీటితో కొండ గుట్టల్లో పశుగ్రాసం అందుబాటులో ఉందని తెలుసుకున్న ఆయన సోమవారం తన స్వగ్రామం నుంచి ఆవులను అక్కడికి తీసుకెళ్లాడు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పశుగ్రాస కేంద్రాలను ఏర్పాటు చేసి పశువులను సంరక్షించాలని రైతు సంఘం మండల కార్యదర్శి కేకే రాజారెడ్డి, సీపీఐ మండల కార్యదర్శి శ్రీరాములునాయుడు డిమాండ్ చేశారు.
రౌడీషీటర్ అరెస్ట్
అనంతపురం సెంట్రల్: యువకుడిపై దాడి చేసిన రౌడీషీటర్ సుధీర్ అలియాస్ పులి అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. నగరంలో ఉమానగర్‌కు చెందిన రౌడీషీటర్ దాసరి సుధీర్ ఈనెల 23న పాతూరు కూరగాయల మార్కెట్ సమీపంలో మహమ్మద్ ఫైజాన్ అహ్మద్‌పై కర్రతో దాడి చేశాడు. దీంతో ఫైజాన్ ముక్కు వద్ద తీవ్ర గాయమైంది. ఎముక విరిగింది. దీనిపై బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సోమవారం నిందితున్ని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. న్యాయస్థానంలో హాజరుపర్చి రిమాండ్‌కు పంపామన్నారు.


