పుట్టపర్తి అర్బన్: మామూళ్లు ఇచ్చేదాకా ఎలాంటి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వబోమన్న రీతిలో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు విద్యుత్ శాఖ అధికారులు. ట్రాన్స్‌ఫార్మర్, విద్యుత్ స్తంభాలు, తీగలు, ఇతర పరికరాలకు డీడీలు తీసి పంపితే కనెక్షన్ ఇవ్వాల్సిన అధికారులు పొలం వైపు కన్నెత్తి చూడడం లేదు. వివరాలు.. గోరంట్ల మండలం దిగువ గంగంపల్లి తండాకు చెందిన రైతులు శివమూర్తి నాయక్, కుల్లాయినాయక్, జగదీష్ నాయక్‌లు బోర్లు వేసి గతంలోనే విద్యుత్ కనెక్షన్ కోసం డిపాజిట్ చెల్లించారు. ఏడాది క్రితం ట్రాన్స్‌ఫార్మర్‌ను తీసుకొచ్చి తండాలోని రోడ్డు పక్కన రచ్చబండపై ఉంచి వెళ్లిన విద్యుత్ శాఖ అధికారులు ఆ తర్వాత చేతులెత్తేశారు. ఇప్పటి వరకూ అమర్చలేదు. అడిగినంత ఇవ్వలేక పోవడంతోనే ఇలా చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
● గోరంట్ల మండలంలోనే గంగంపల్లికి చెందిన మరో రైతు చాకల గోవింద్‌ది కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే. గోవింద్ బోరు వేసి పంటలు సాగు చేస్తున్నాడు. డిపాజిట్ చెల్లించి చాలా కాలమైంది. ఇప్పటి వరకూ విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదు. దీంతో చేసేది లేక ఇతర రైతుల బోరు బావుల నుంచి విద్యుత్ కనెక్షన్ తీసుకొని పంటను కాపాడుకుంటున్నాడు. విద్యుత్ తీగలను కట్టెల సహాయంతో మోటార్ వద్దకు లాగాల్సి వచ్చిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యంతో పంటలు ఎలా సాగు చేయాలో అర్థం కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


