పెనుకొండ రూరల్: తల్లిని దూషించి, బెదిరింపులకు పాల్పడిన కుమారుడికి న్యాయస్థానం మూడు నెలలు జైలు శిక్ష విధించింది. కియా ఎస్‌ఐ డి. రాఘవయ్య తెలిపిన మేరకు.. పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని వెంకటరెడ్డిపల్లికి చెందిన వెంకటలక్ష్మి తన కుటుంబ సభ్యులతో కలిసి 2024లో కుంభకర్ణ హోటల్‌కు భోజనానికి వెళ్లింది. కుటుంబ విభేదాలు, కోర్టు కేసులు ఉన్న నేపథ్యంలో సోదరుడితో కలసి అక్కడికి చేరుకున్న పెద్ద కుమారుడు పీవీ జగన్నాథ్ తల్లి వెంకటలక్ష్మిని అసభ్య పదజాలంతో దూషించాడు. చంపేస్తానంటూ బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పటి కియా ఎస్‌ఐ రంగడు కేసు నమోదు చేసి ముద్దాయిని కోర్టులో ప్రవేశపెట్టారు. పూర్వాపరాలు విచారించిన అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు సోమవారం జగన్నాథ్‌కు మూడు నెలలు సాధారణ జైలు శిక్ష, రూ. 8 వేల జరిమాన విధించింది.
ధర్మమే దిక్సూచిగా మానవ జీవితం సాగాలి
ప్రశాంతినిలయం: ధర్మమే దిక్సూచిగా అంతరంగాన్ని మేల్కొలుపుతూ ప్రతి మనిషి తన జీవిత గమనాన్ని సాగించడం ద్వారా సమసమాజ స్థాపన సాధ్యమవుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ప్రశాంతినిలయంలో సత్యసాయి విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారతీయ సంస్కృతీ, ఆధ్యాత్మిక శిక్షణా తరగతుల్లో భాగంగా రెండో రోజు సోమవారం చర్చా గోష్టి నిర్వహించారు. సాయికుల్వంత్ సభా మందిరంలో జరిగిన కార్యక్రమంలో పలువురు సత్యసాయి విద్యాసంస్థలకు చెందిన మహిళా ఉపన్యాసకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంతపురం మహిళా క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ పీఎల్ రాణి మాట్లాడుతూ ఆధునిక సమాజంలో యువత ధర్మాన్ని ఆచరించడం పట్ల దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఇందికా సంస్థ ప్రోగ్రాం లీడర్ సాయి స్వరూప, లోయస్ ఇండియా సాప్ట్‌వేర్ సంస్థ సీనియర్ డైరెక్టర్ సాయి గీత, సత్యసాయి జనరల్ ఆసుపత్రి సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లతాశ్రీ, యూకేకు చెందిన విద్యుల్లతా నారాయణ్ మాట్లాడారు.
అమ్మమ్మ ఊరికి వెళ్లి.. తిరిగి రాని లోకాలకు
శాంతిపురం: అమ్మమ్మ ఊరికి వెళ్లిన ఓ బాలుడు తిరిగి రాని లోకాలకు చేరాడు. కళ్యాణదుర్గం ప్రాంతానికి చెందిన సాత్విక్ (5) తన తల్లి దీపతో కలిసి కొన్ని రోజుల క్రితం చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కడపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. సోమవారం ఇంటి అవసరాల కోసం రోడ్డు పక్కన ట్యాంకర్ నుంచి గ్రామస్తులు నీరు పడుతుండగా, తోటి చిన్నారులతో సరదాగా సాత్విక్ అక్కడికి వెళ్లాడు. ఈ క్రమంలోనే ఓ టెంపో వీరిపై దూసుకెళ్లింది. తీవ్ర గాయాలైన సాత్విక్‌ను కుప్పం ఏరియా ఆస్పత్రిఇకి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.


